NTR Car: జూ. ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు, లోపల ఆయన కుమారుడు కూడా, పోలీసులు ఏం చేశారంటే
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు బ్లాక్ ఫిల్మును పోలీసులు గుర్తించారు. ఆ కారును ఆపి బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ లేరు.
Hyderabad Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సంగతి తెలిసిందే. కార్లకు నకిలీ స్టిక్కర్లు, ఎమ్మెల్యే స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్ములతో తిరుగుతున్నవారిని గుర్తించి వారికి చలానాలు విధించారు. మరికొందరికి స్టిక్కర్లను తొలగించారు. ఈ క్రమంలోనే బ్లాక్ ఫిల్ములతో ప్రయాణించే వారిని గుర్తించి వారి వాహనాలకు కూడా నల్ల స్టిక్కర్‌ను తొలగించారు. ఖైరతాబాద్ (Khairatabad) పరిధిలోని ఇందిరాగాంధీ చౌరస్తా, ఫిలింనగర్ కూడలి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సహా చాలా ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్‌లు ఆదివారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద తనిఖీలు జరిగాయి. బ్లాక్ ఫిల్ములు, స్టిక్కర్ల వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు.
ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్‌కు (Junior NTR Car) చెందిన కారుకు బ్లాక్ ఫిల్మును పోలీసులు గుర్తించారు. ఆ కారును ఆపి బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ లేరు. డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. డ్రైవరుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు, మరో వ్యక్తి ఉన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న వారు స్పష్టంగా కనిపించాల్సిందేనని, బ్లాక్ ఫిల్మ్ కోటింగ్ ఉన్న అద్దాలు అమర్చడం నిబంధనలకు విరుద్ధం అనే సంగతి తెలిసిందే.
మొత్తం 90 వాహనాలకు బ్లాక్ ఫిల్మ్‌ను (Car Black Film) తొలగించి కొంత మందికి జరిమానాలు విధించినట్లు సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్, జూబ్లీహిల్స్ సీఐ ముత్తు తెలిపారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్, ఎంఐఎం ఎమ్మెల్యే మేరాజ్ హుస్సేన్, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి స్టిక్కర్లను తొలగించారు. నంబరు ప్లేటు సరిగా లేని వాహనాలకు చలానాలు వేశారు.
జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం (Jubilee Hills) తరువాత ట్రాఫిక్ పోలీసులు రూట్ మార్చారు. బోధన్ ఎమ్మెల్యే (Bodhan MLA) కుమారుడు కారులో ఉండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నెలల పసికందు చనిపోగా, ఓ మహిళ గాయాలపాలయింది. ప్రస్తుతం బోధన్ ఎమ్మెల్యే షకీల్ (MLA Shakeel) కుమారుడు రేహాన్ ఆచూకీ ఇంకా తెలియలేదు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. నగరంలో చాలా మంది ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే నకిలీ స్టిక్కర్ పెట్టుకోవడం, పోలీస్ కాకపోయినా పోలీస్ స్టిక్కర్ వేయించుకోవడం, ఇలాగే ఆర్మీ, డాక్టర్, ప్రెస్ అంటూ స్టిక్కర్లు అంటించుకుని తిప్పుతున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.