Hyderabad Shopping: హైదరాబాద్‌లో షాపులు 10.30కే క్లోజ్ అంటూ పోలీసుల ఆదేశాలు - కుదరదన్న ఒవైసీ!
Asaduddin Owaisi: హైదరాబాద్‌లో షాపులను 10.30 గంటలకే మూసివేయాలన్న ఆదేశాలను నగర ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఆ ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని కోరారు.
Telangana News: హైదరాబాద్ నగరంలో షాపింగ్ విషయంలో తాజాగా నగర పోలీసులు జారీ చేసిన ఆదేశాలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న చెదురుమదురు అల్లర్ల కారణంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర వ్యాప్తంగా రాత్రి 10:30 గంటలకు అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాత్రి 10:30 దాటితే లాఠీ పోలీసే ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని పాత బస్తీలో అర్ధరాత్రి దాటినా కూడా జనం రోడ్ల మీద ఉంటుండడంతో పోలీసులు మైక్ లో కూడా వార్నింగ్ లు ఇస్తూ ఉన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, పోలీసులు జారీ చేసిన ఈ కొత్త ఆదేశాలను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
పోలీసులు ఇలాంటి ఆదేశాలను జూబ్లీహిల్స్‌లో ఇవ్వగలరా అని అసదుద్దీన్ ప్రశ్నించారు. వ్యాపారాలు ఇరానీ చాయ్ అయినా, పాన్ షాపులు అయినా, పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు అయినా కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకూ తెరచి ఉంచేలా చేయాలని కోరారు. ఒకవేళ కుదరకపోతే నగర వ్యాప్తంగా ఒకే విధమైన పాలసీ ఉండేలా చేయాలని అన్నారు.
‘‘10.30 గంటలకే షాపులు మూసేయాలనే ఆర్డర్స్‌ను తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇవ్వగలరా? ఇరానీ చాయ్ అయినా, పాన్ షాప్ అయినా, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ అయినా కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకూ తెరచి ఉంచాలి. ఒకవేళ కుదరకపోతే నగర వ్యాప్తంగా ఒకే విధమైన పాలసీ ఉండేలా చేయాలి. ఇప్పటికే మెట్రో నగరాలు అన్నీ కూడా షాపుల్ని రాత్రంతా తెరచి ఉంచేలా వెసులుబాటు కల్పిస్తున్నాయి. అసలే మనకు ఆర్థిక లోటు ఉంది. అలాంటప్పుడు హైదరాబాద్‌లో 10.30 గంటలకే షాపులు మూసేయడం దేనికి?’’ అని ప్రశ్నించారు.
.@TelanganaDGP @CPHydCity could such an announcement be made by police in Jubilee Hills? Whether they are Irani chai hotels or pan shops or commercial establishments, they should be allowed to remain open till 12 AM at least. In any case, there should be a uniform policy across… https://t.co/bw7kVyYLvF
— Asaduddin Owaisi (@asadowaisi) June 24, 2024