Hyderabad News: ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం - ఎడమ కాలికి బదులుగా కుడి కాలికి ఆపరేషన్, రెండ్రోజుల తర్వాత గుర్తించి మళ్లీ సర్జరీ!
Hyderabad News: ఎడమ కాలికి బదులుగా కుడి కాలుకు ఆపరేషన్ చేశారు. ఆపై గుర్తించి మరోసారి ఎడమ కాలికి సర్జరీ చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య మండలి బాధ్యుడైన వైద్యుడిపై గుర్తింపును రద్దు చేసింది.
Hyderabad News: ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా ఓ వ్యక్తికి డెంగ్యూ సోకగా.. పెద్దాసుపత్రికి సిఫార్సు చేయాల్సింది పోయిన చనిపోయే వరకు తన దగ్గరే ఉంచుకున్నాడు. మరో వైద్యుడు అయితే ఎడమ కాలుకు బదులుగా కుడి కాలుకు ఆపరేషన్ చేశాడు. ఆ విషయాన్ని రెండ్రోజుల తర్వాత గుర్తించి మళ్లీ ఎడమ కాలుకు సర్జరీ చేశాడు. ఈ రెండు ఘటనల గురించి తెలుసుకున్న రాష్ట్ర వైద్య మండలి బాధ్యులైన ప్రైవేటు వైద్యుల గుర్తింపును రద్దు చేసింది. కరణ్ ఎం పాటిల్ అనే వైద్యుడి గుర్తింపును ఆరు నెలలపాటు, సీహెచ్ శ్రీకాంత్ అనే మరో వైద్యుడి గుర్తింపును మూడు నెలల పాటు రద్దు చేస్తూ... తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ వి రాజలింగం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గుర్తింపు రద్దైన ఇద్దరు ప్రైవేటు వైద్యులు తమ సర్టిఫికేట్లను రాష్ట్ర వైద్య మండలికి అందజేయాలని ఆదేశించారు.
ఎడమ కాలికి బదులుగా కుడి కాలికి..!
హైదరాబాద్ లోని ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కరణ్ ఎం. పాటిల్ అనే ఆర్థో పెడిషియన్.. ఓ రోగికి ఎడమ కాలికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. కుడి కాలికి చేశారు. అయితే ఈ సర్జరీ జరిగిన రెండ్రోజుల తర్వాత వైద్యుడు ఆ విషయాన్ని గుర్తించి తిరిగి ఎడమ కాలికి ఆపరేషన్ చేశారు. దీనిపై బాధితులుడీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఆయన చేసిన తప్పును గుర్తించి పైఅధికారులకు తెలపగా.. ఆయన గుర్తింపును రద్దు చేశారు.
డెంగ్యూ సోకినా.. పెద్దాసుపత్రికి సిఫార్సు చేయకుండా..!
అలాగే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి డెంగ్యూతో ఆసుపత్రిలో చేరగా వైద్యుడు సీహెచ్ శ్రీకాంత్ అతడిని సకాలంలో మెరుగైన వైద్య కోసం పెద్ద ఆసుపత్రికి సిఫార్సు చేయలేదు. తన వద్దే ఉంచుకొని చికిత్స చేశాడు. ఈ క్రమంలోనే సదరు రోగి మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు.. వైద్యుడు నిర్లక్ష్యం చేయడం వల్లే వ్యక్తి ప్రాణాలు పోయినట్లు గుర్తించారు. కలెక్టర్ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర వైద్య మండలి విచారణ చేసి శ్రీకాంత్ గుర్తింపును రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గుర్తింపు రద్దుపై 60 రోజుల్లో అప్పీల్ చేసుకునేందుకు ఇద్దరు వైద్యులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతల మృతి
ఇటీవలే హైదరాబాద్ మలక్ పేట్ ఏరియా హాస్పిటల్ లో దారుణ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందారు. డెలివరీ కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందారు. నిర్లక్ష్యంగా డెలివరీ చేయడంతోనే బాలింతలు మృతి చెందారని బంధువుల ఆందోళన చేశారు. బాలింతరాలు సిరివెన్నెలకు డెంగ్యూ ఉన్నా వైద్యులు గుర్తించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. డెంగ్యూతో బాధపడుతున్నా డెలివరీ చేశారని ఆరోపించారు. ప్లేట్ లెట్స్ పడిపోవడంతో సిరివెన్నెలను హుటా హుటిన గాంధీ ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ ఆమె చనిపోయిందని తెలిపారు. మరో ఘటనలో శివానీ అనే బాలింత మృతి చెందింది. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శివానీ చనిపోయిందని బంధువుల ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువుల డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుల పై చర్యలకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బంధువుల ఆందోళనతో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.