Hyderabad News: స్కూల్ అసిస్టెంట్లను మాత్రమే ట్రాన్స్ ఫర్ చేశారు, మేమేం పాపం చేశామంటూ మిగతా టీచర్ల ఆవేదన
Hyderabad News: ఉపాధ్యాయ దంపతులు ఒకేచోట పనిచేసేలా బదిలీలు చేపట్టాలని కోరుతూ.. ఉపాధ్యాయ దంపతులు మంత్రులకు వినతి పత్రాలు అందించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
Hyderabad News: ఉపాధ్యాయ దంపతులు ఒకే చోట పని చేసేలా బదిలీలు చేపట్టాలని కోరుతూ కపుల్స్ అయిన టీచర్లు రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వచ్చిన ఉపాధ్యాయ దంపతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రులను కలిశారు. అనంతరం వారికి వినతి పత్రాలు అందజేసి తమ బాధలను వెల్లడించారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పని చేసేలా ట్రాన్స్ ఫర్ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ... అందరు ఉపాధ్యాయ దంపతులకు వర్తించడం లేదని స్పౌజ్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ దంపతులకు మాత్రమే బదిలీలు చేపట్టారని తెలిపారు. ఎస్జీటీ, లాంగ్వేజ్ పండితులు, పీఆటీ ఉపాధ్యాయ దంపతులకు చేయడం లేదని తమ బాధను వెళ్లగక్కారు.
13 జిల్లాలను బ్లాక్ లో ఉంచిన ప్రభుత్వం..!
ఎలాగైనా సరే తమకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రుల చుట్టూ, లక్డీకాపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాల చుట్టూ గత పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ దంపతులు వాపోయారు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకే చోట పని చేస్తే ఉత్పాదకత పరుగుతుందని.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు పేర్కొన్నారని గుర్తుచేస్తున్నారు. గతేడాది 19 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరిపి మరో 13 జిల్లాలను బ్లాక్ లో ఉంచారని చెబుతున్నారు ఏడాది కాలం నుంచి స్పౌజ్ ఫోరం సభ్యులు చేస్తున్న ఆవేదన కార్యక్రమాలు, మౌన దీక్షలు, వినతి పత్రాలతో సీఎం కేసీఆర్ పద్ద మనసుతో ఈ సమస్యకు పరిష్కారం చూపి ముందుకు రావడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను చేపట్టడం జరిగిందన్నారు. కానీ 2100 అప్లికేషన్లలో కేవలం 30 శాతం మాత్రమే బదిలీలు చేపట్టి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అనే సాకు చూపించి ఎస్జీటీ, పీఆటీ, భాషా పండితుల బదిలీలను వదిలేశారని వాపోయారు.
వాస్తవానికి ఎస్జీటీ విభాగంలో ప్రస్తుతం చాలా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రమోషన్ల తర్వాత ఇంకా ఎక్కువ ఖాళీలు ఏర్పడనున్నాయని ఉపాధ్యాయ దంపతులు వెల్లడించారు. ఇందులో 80 శాతం నుంచి 90 శాతం వరకు ఇబ్బంది పడుతోంది మహిళా ఉపాధ్యాయులేనని వివరించారు. ప్రతిరోజు 150 కిలో మీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఇటు కుటుంబానికి అటు వృత్తికి దూరమై తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా సదరు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలను తీర్చాలని కోరారు.
ఉపాధ్యాయ దంపతులకు గుడ్ న్యూస్ చెప్పినట్లే చెప్పి..!
ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు దాదాపు పది రోజుల కిందటే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల విషయంలో గత కొంత కాలంగా ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చేస్తుండగా.. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీచర్ దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను ట్రాన్స్ ఫర్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కేవలం ఇందుకు మొత్తం 2100 దరఖాస్తులు వెళ్లగా.. కేవలం 615 మందిని మాత్రమే బదిలీ చేశారు.