Telangana Elections 2023: గచ్చిబౌలిలో భారీగా నోట్ల కట్టలు, రూ.5 కోట్ల సొమ్ముతో అడ్డంగా బుక్!
Cash in Hyderabad: గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనాన్ని ఆపారు. అందులో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.
Telangana News: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ విచ్చలవిడిగా డబ్బు చిక్కుతోంది. పోలింగ్ జరగడానికి ఇంకో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. మరోవైపు ఓటర్లకు పంచడానికి డబ్బు తరలింపు కూడా జోరందుకుంది. తాజాగా నేడు (నవంబర్ 23) హైదరాబాద్ లో ఏకంగా రూ.5 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల కోడ్ ఉన్నందున పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలో భాగంగా భారీగా నగదు పట్టుబడింది. దీంతో మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు పట్టుబడిన సొమ్ము ఏకంగా రూ.650 కోట్లకు పైగా చేరింది.
గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనాన్ని ఆపారు. అందులో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. రెండు కార్లలో రూ.5 కోట్ల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుంచి చిరెక్ పబ్లిక్ స్కూల్ రూట్ లో ఈ డబ్బు దొరికింది. కారులో గుర్తు తెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు ముందుగానే సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కారులో రూ.5 కోట్లు దొరికాయి. వెంటనే పోలీసులు ఈ సొమ్మును సీజ్ చేశారు. అయితే, పట్టుబడిన నగదు ఓ వ్యాపారవేత్తకు చెందినదిగా తెలుస్తోంది. పోలీసులు పట్టుకున్న నగదును ఐటీశాఖకు అప్పగించారు.