Hyderabad News: పెళ్లై భర్త చనిపోయిన యువతితో ప్రేమాయణం - వివాహం చేసుకోమంటే ట్యాంకర్ కిందక తోసి హత్య
Hyderabad News: పెళ్లై భర్త చనిపోయిన అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు. వివాహం చేసుకొమ్మని అడిగితే వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని ఈమెను ట్యాంకర్ కిందకు తోసేసి హత్య చేశాడు.
Hyderabad News: ఓ యువతికి 2022లో క్రితం వివాహం జరిగింది. 2023 ఏప్రిల్ నెలలో భర్త చనిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు ప్రేమిస్తున్నానంటూ మాట ఆమెతో కలిపాడు. వెంటపడి మరీ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి నిలదీయగా... నిన్ను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. ఆమె మోసపోయానంటూ ఏడుస్తూ ఉండగానే.. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇద్దరూ కాసేపు గొడవ పడ్డారు. ఈక్రమంలోనే యువకుడు.. ఆమెను అటుగా వస్తున్న ట్యాంకర్ కిందకు తోసేసి హత్య చేశాడు.
అసలేం జరిగిందంటే..?
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండాకు చెందిన హరిజియా కుమార్తె 23 భూక్యా ప్రమీల ఇంటర్ పూర్తి చేసి కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. 2022 జనవరిలో ఆమెకు పెళ్లి జరగగా.. ఏప్రిల్ లో భర్త చనిపోయాడు. అయితే ఇంటికెళ్లి ఏం చేయాలో తెలియక గరంలోని బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు యువతులతో కలిసి ఉంటూ బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో పని చేస్తున్నారు. ఆమెకు తన సొంతూరు సమీపంలోని రోడ్ బండ తండాకు చెందిన 25 ఏళ్ల భూక్యా తిరుపతి నాయక్ తో చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. అయితే అతడు ప్రస్తుతం నగరంలోని కొండాపూర్ లో కారు డ్రైవర్ గా పని చేసే అతనితో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో తిరుపతికి ఇటీవల మరో యువతితో నిశ్చితార్థం జరగడంతో విషయం తెలుసుకున్న ప్రియురాలు అతనికి ఫోన్లు చేస్తూ... తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది.
నీళ్ల ట్యాంకర్ కింద తోసి హత్య
తనను కాకుండా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులకు విషయం చెబుతానని బెదిరించింది. ఈక్రమంలోనే ఆదివారం రోజు ఆమెను కలవాలని కోరగా.. తిరుపతి ద్విచక్ర వాహనంపై మరో మిత్రుడితో వెళ్లి, బాచుపల్లి ప్రధాన రహదారి వద్ద ఆమెను కలిశాడు. పెళ్లి విషయంపై ఆమె నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, పెనుగులాట చోటు చేసుకున్నాయి. తీవ్ర ఆవేశానికి లోనైన తిరుపతి ఆమెను అటుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్ కిందకు తోసేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రమాదవశాత్తు ప్రమీల ట్యాంకర్ కింద పడిందంటూ డ్రామా
అయితే హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు తిరుపతి చాలానే కష్ట పడ్డాడు. స్థానికులతో పాటు పోలీసులకు కూడా ప్రమీల ప్రమాదవశాత్తే ట్యాంకర్ కింద పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతని మాట తీరు అనుమానంగా ఉండడంతో పోలీసులు గట్టిగా నిలదీశారు. దీంతో తానే ప్రమీలను ట్యాంకర్ కిందకు తోసేసినట్లు తిరుపతి అంగీకరించాడు. పెళ్లి చేసుకొమ్మని వేధించడం వల్లే ఇలా చేసినట్లు వెళ్లడించాడు. ఈక్రమంలోనే పోలీసులు నిందితుడు తిరుపతిని అరెస్ట్ చేశారు. మృతురాలు ప్రమీల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి ఇన్ స్పెక్టర్ ఎన్.సుమన్ కుమార్, ఎస్సై సంధ్య తెలిపారు.