RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Andhra News: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో చాలా పాపులర్ అయ్యిందని కొనియాడారు.
CM Chandrababu Congratulating AP Deputy Speaker Raghurama Raju: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులరో.. రాజకీయాల్లో రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) రచ్చబండ ప్రోగ్రాం అంత పాపులర్ అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రశంసించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘరామ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి రఘురామకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. రఘురామకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కొత్త స్థానంలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతోందని.. తెలుగుబిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ.. స్పీకర్ స్థానానికే నిండుతనం తీసుకొచ్చారని ప్రశంసించారు.
'రఘురామ పోరాట యోధుడు'
రఘురామ పోరాట యోధుడిగా నిలిచి గెలిచారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఎంపీగా పని చేసిన ఐదేళ్లలో ఆయన్ను నియోజకవర్గానికి రానీయకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని కొనియాడారు. 'మాజీ సీఎం జగన్.. రఘురామను పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పైశాచికానందం పొందారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నా. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానీయని వారు.. నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది.. దేవుడు రాసిన స్క్రిప్ట్.
ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్ట్ మూడూ జరిగాయి. శుక్రవారం అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని కుట్ర చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేయడం దారుణం. లాఠీలు, రబ్బర్ బెల్టులతో అరికాళ్లపై కొట్టారు. ఇలా అని కోర్టులో చెబితే కస్టడీలో చంపేస్తామని బెదిరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు పంపి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు చెప్పింది. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నివేదికను తారుమారు చేసేందుకు యత్నించారు. వైద్య పరీక్షల నివేదిక కోర్టులో సమర్పించేందుకు ఆలస్యం చేశారు. రఘురామను తీసుకురావాలని కోర్టు చెబితే తీసుకెళ్లకుండా మొరాయించారు. చివరికి హైదరాబాద్ మిలిటరీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రఘురామ నిలిచి గెలిచారు.' అంటూ సీఎం ప్రశంసించారు.
పవన్ అభినందనలు
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం రఘురామకు అభినందనలు తెలుపుతూ ఆయన పోరాట పటిమను కొనియాడారు. 'నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వారే ఈ రోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. ఉండి నియోజకవర్గం నుంచి 56 వేల పైచిలుకు ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీకి వచ్చారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసింది. నేరస్థులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటివరకూ చూశాం. గత ప్రభుత్వంలో అందరూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడ్డారు. రాజకీయాల్లో నేరస్థులకు స్థానం ఉండకూడదు.' అని పవన్ పేర్కొన్నారు.