Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Guntur News: వైసీపీ నేత, పలు కేసుల్లో నిందితుడు బోరుగడ్డ అనిల్‌కు పీఎస్‌లోనే రాచమర్యాదలు కల్పించడంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. నలుగురు కానిస్టేబుళ్లపై వేటు వేశారు.
Suspension Of Constables In Guntur: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు (Borugadda Anil) పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలు కల్పించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేస్తూ గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇటీవలే బోరుగడ్డ అనిల్‌కు రాజమహేంద్రవరం కారాగారానికి తరలిస్తూ.. ఓ రెస్టారెంట్‌లో బిర్యానీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ పోలీస్ ఉన్నతాధికారులు విచారించి సదరు పోలీసులపై చర్యలు చేపట్టారు. అలాగే, అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో బోరుగడ్డకు రాచమర్యాదలకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
పీఎస్‌లోనే దర్జాగా..
గత నెలలో పీఎస్‌కు తరలించిన పోలీసులు అక్కడ బోరుగడ్డకు సకల సౌకర్యాలు కల్పించారు. దుప్పటి, దిండు ఇచ్చి ప్రత్యేక బెడ్ ఏర్పాటు చేశారు. ఈ వీడియోలు గతంలోనే వెలుగుచూశాయి. తాజాగా మరిన్ని వీడియోలు బయటకు వచ్చాయి. రెండు రోజుల క్రితం బయటకు వచ్చిన ఓ వీడియోలో స్టేషన్‌లోనే బోరుగడ్డ అనిల్ దర్జాగా కుర్చీలో కూర్చున్నాడు. బయట నుంచి వచ్చిన అతని కుటుంబ సభ్యులు సైతం అతన్ని కలిసి వెళ్లిన సీసీ టీవీ వీడియోలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం ఇది గత నెల 20న రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ పిల్లాడు వచ్చి బోరుగడ్డను కలిసి కుర్చీలో కూర్చుని చాలా సేపు మాట్లాడి వెళ్లాడు. అక్కడున్న పోలీసులు దగ్గరుండి ఆ పిల్లాడిని బోరుగడ్డను కల్పించగా ఆ పిల్లాడు తన మేనల్లుడు అని చెప్పటం సీసీ టీవీ కెమెరాలో ఆడియోతో సహా రికార్డైంది. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారించి కానిస్టేబుళ్లపై చర్యలు చేపట్టారు.
కాగా, వైసీపీ హయాంలో పలు యూట్యూబ్, మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూల్లో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లను.. బోరుగడ్డ అనిల్ అసభ్య పదజాలంతో దూషించాడు. విచక్షణ మరిచి బూతులతో విరుచుకుపడ్డాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురి ఫిర్యాదు మేరకు వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 17 కేసులు అతనిపై నమోదయ్యాయి. ఈ క్రమంలోనే బోరుగడ్డను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అతనికి పోలీస్ స్టేషన్‌లోనే రాచమర్యాదలు కల్పిస్తున్నారనే దానిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ కాగా ఉన్నతాధికారులు చర్యలు చేపడతున్నారు. ఇటీవల విచారణ సందర్భంగా వేరే ప్రాంతానికి తరలిస్తుండగా.. బోరుగడ్డను రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన పోలీసులు బిర్యానీ తినిపించారు. అయితే, పలురువు టీడీపీ సానుభూతిపరులు ఈ తతంగాన్ని చూసి వీడియోలు తీయగా.. పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వీడియోలు దగ్గరుండి డిలీట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రాగా సదరు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.