Vizianagaram MLC Election: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Andhra Pradesh: విజయనగరం స్థానిక సంస్థల ఉపఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. రఘురాజుపై వేసిన అనర్హతా వేటును హైకోర్టు కొట్టి వేయడమే కారణం.
Central Election Commission has canceled the by election of Vizianagaram local bodies: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇప్పటికే నామినేషన్ల గడువు ముగిసింది. అయితే హైకోర్టు తీర్పును అనుసరించి ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లుగా ఈసీ ప్రకటించింది.
ఇందుకూరి రఘురాజుపై అనర్హత చెల్లదన్న హైకోర్టు
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజుపై ఎన్నికలకు ముందు చైర్మన్ మోషేన్ రాజు అనర్హతా వేటు వేశారు. అయితే తాను ఎక్కడా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అధిగమించలేదని తనపై అన్యాయంగా అనర్హతా వేటు వేశారని ఎమ్మెల్సీ రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే ఎన్నికల సంఘం ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇటీవల హైకోర్టు రఘురాజుజపై అనర్హతా వేటు చెల్లదని స్పష్టం చేసింది. దీంతో రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగడం ఖాయమయింది. కానీ హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో ఏమీ చెప్పలేదు.
Also Read: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఈసీ అధికారికంగా ప్రకటించడంతో ఎన్నిక ప్రక్రియ రద్దు
ఇందుకూరి రఘురాజు తనపై అనర్హతా వేటు విషయంలో మాత్రమే కోర్టును ఆశ్రయించారు. ఆ తీర్పు రావడంతో ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రభావం పడింది. అయితే అధికారిక ప్రకటన చేయాల్సింది ఎన్నికల సంఘం కాబట్టి ఉత్కంఠత ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇందుకూరి రఘురాజు సతీమణి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఎందుకైనా మంచిదని వారు నామినేషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హైకోర్టు తీర్పు కాపీలు అందడంతో.. రఘురాజు స్థానం ఖాళీ కానట్లే అక్కడ ఉపఎన్నిక నిర్వహించినా చెల్లదన్న అంచనాకు వచ్చిన ఎన్నికల సంఘం తాజాగా ఆ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
పూర్తి కాలం ఎమ్మెల్సీగా కొనసాగనున్న రఘురాజు
విజయనగరం జిల్లాకు చెందిన ఇందుకూరి రఘురాజు వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆయనకు బొత్స సత్యనారాయణతో సరిపడకపోవడంతో ఆయన పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. తన ప్రత్యర్థుల్ని ప్రోత్సహిస్తూ తనను బొత్స పక్కన పెట్టేస్తున్నారని ఇందుకూరి రఘురాజు అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన వర్గం అంతా టీడీపీలో చేరిపోయారు. అనర్హతా వేటు పడుతుందన్న కారణంగా ఆయన మాత్రం పార్టీ మారలేదు. అయితే పార్టీ మారిపోయారని వైసీపీ నేతలు శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. విచారణకు నోటీసులు ఇచ్చినా రఘురాజు హాజరు కాలేదు. అయినప్పటికీ అనర్హతా వేటు వేశారు. చివరికి న్యాయపోరాటం చేసి తన పదవిని తాను కాపాడుకున్నారు.