Hyderabad News: మైనర్‌తో యువకుడి ప్రేమ పెళ్లి - బిడ్డ పుట్టాక బాలికకు నరకం, కొడుకుని నేలకేసి కొట్టి దారుణం!
Hyderabad News: 8 తరగతిలో ప్రేమ, పదో తరగతిలోనే పెళ్లి. వివాహం అయిన ఏడాదిలోపే నరకం చూపించాడు. శారీరకంగా వాడుకొని తీవ్రంగా వేధించాడు. చివరకు ఏం జరిగిందంటే?
Hyderabad News: ఆమె చిన్న వయసులోనే ప్రేమిస్తున్నానంటూ ఓ వ్యక్తి వెంటపడ్డాడు. ప్రేమ నిజమే అనుకొని ఓకే చెప్పింది. రెండేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన అతడు.. బాలిక పదో తరగతి పరీక్షలు రాస్తుండగా బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆపై నరకం చూపించాడు. ఈ క్రమంలోనే వీరికి ఓ బాబు పుట్టగా.. ఆ చిన్నారిని నేలకేసి కొట్టాడు. ఎట్టకేలకు బాలిక పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ నల్లకుంటకు చెందిన 19 ఏళ్ల సాయి ప్రణీత్ మూడేళ్ల క్రితం నగరానికి చెందిన 8వ తరగతి బాలికను ప్రేమించానంటూ వెంట పడ్డాడు. పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తుండగా.. బలవంతంగా ఎత్తుకెళ్లి యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బోరబండ ప్రాంతానికి వచ్చి కొంతకాలం కాపురం చేశారు. అనంతరం సరూర్ నగర్ కు వెళ్లి గదిని అద్దెకు తీసుకున్నారు. గంజాయి, మద్యానికి అలవాటు పడిన యువకుడు బాలికను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. గతేడాది డిసెంబర్ లో బాలికకు బాబు పుట్టాడు. ఇక ఇప్పటి నుంచి మరింత నరకం చూపించడం మొదలుపెట్టాడు.
బోరబండలో బంధువులు ఉండడంతో ఆమె అక్కడకు వెళ్లింది. మరింత కోపం సాయి ప్రణీత్ బాబును తీసుకొని నేలకేసి కొట్టాడు. దీంతో బాబు తలకు తీవ్ర గాయం అయింది. వెంటనే బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆపై సాయి ప్రణీత్ పై బాలిక ఫిర్యాదు చేసేందుకు పలు పోలీస్ స్టేషన్ లకు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. తమ ఏరియా పరిధిలోకి రాదని చెప్పి వెనక్కి పంపారు. విషయం దక్షిణ మండలం డీసీపీ జోయల్ డేవిస్ దృష్టికి రావడంతో బాధితురాలి ఫిర్యాదు తీసుకోవాలని బోరబండ పోలీసులను ఆదేశించారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవలే వరంగల్ జిల్లాలో వేధింపులు తాళలేక యువ డాక్టర్ మృతి
వరంగల్ జిల్లా దుర్గొండి మండలం కేశవాపూర్ కు చెందిన గంగాధర్ రెడ్డి నగరంలోని చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అయితే ఇతడికి వర్ధన్నపేట మండలం కడారిగూడేనికి చెందిన నిహారిక రెడ్డితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద నగరంలోని 300 గజాల ప్లాట్, ఇతర కానుకలు ఇచ్చారు. అయితే ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న వీరికి నాలుగు నెలల క్రితమే పాప పుట్టింది. ఇటీవల కారు కావాలని గంగాధర్ రెడ్డి అడగ్గా.. అందుకు నిహారిక తల్లిదండ్రులు అంగీకరించారు. అయినప్పటికీ పెళ్లి అప్పుడు ఇస్తామన్నా కానుకల విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. పాప పుట్టిందన్న సంతోషాన్ని కూడా ఆస్వాదించకుండా.. పుట్టింటి వాళ్లతో గొడవలు పడడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఎన్ని రోజులు బతికినా ఇంతే అనుకుంది. ఈ క్రమంలోనే చనిపోవాలని నిశ్చయికుంది.
ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో నిద్రించారు. పాపను పడుకోబటెట్టుకొని పడుకున్న నిహారిక అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే నిద్రలో ఉన్న పాపు గురువారం వేకువ జాము నుంచి ఏడవడం ప్రారంభించింది. చాలా సేపటి నుంచి పాప ఏడుపు వినిపించడంతో.. భర్త తలుపులు తీసే ప్రయత్నం చేశాడు. కానీ గడియ పెట్టి ఉండడంతో దాన్ని పగుల గొట్టి మరీ లోపలికి వెళ్లాడు. అప్పటికే నిహారిక ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. ఏం చేయాలో తెలియని అతను పాపను తీసుకొని బయటకు వచ్చాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్ స్పెక్టర్ షూకుర్ మృతదేహాన్ని కిందికి దింపించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న నిహారిక తల్లిదండ్రులు అత్త, భర్త, ఆడబిడ్డల వేధింపులు తాళలేక తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.