Hyderabad News: దోమలగూడ గ్యాస్ లీక్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి - విషమంగానే ఇద్దరి పరిస్థితి
Hyderabad News: హైదరాబాద్ లోని దోమలగూడలో ఇటీవలే జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో మరో మహిళ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది.
Hyderabad News: హైదరాబాద్ లోని దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో ప్రమాద ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. మరో ఇద్దరు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వివరిస్తున్నారు. హైదరాబాద్ లో బోనాల పండుగ సందర్భంగా ఈనెల 10వ తేదీన దోమలగూడలోని ఓ ఇంట్లో పిండి వంటలు రెడీ చేస్తుండగా.. గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులతో సహా మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇప్పటికీ విషమంగానే మరో ఇద్దరి పరిస్థితి
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శరణ్య అనే చిన్నారి అదే రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 14వ తేదీన పద్మ, ఆమె కూతురు ధనలక్ష్మీ, ధనలక్ష్మీ కుమారుడు అభినవ్ లు మరణించారు. అయితే ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న నాగమణి ఈరోజు మృతి చెందింది. దీంతో గ్యాస్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆనంద్, విహాన్ లు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇటీవలే ఫతేనగర్ లో అమ్మోనియా గ్యాస్ లీక్ - 15 మందికి అస్వస్థత
హైదరాబాద్ ఫతేనగర్ లో అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఈ కారణంగా పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు. పైప్ లైన్ రోడ్డు చివరన చెత్త కుప్పల్లో చాలా కాలం నుంచి రెండు అమ్మోనియా గ్యాస్ సిలిండర్లు పడి ఉన్నాయి. అయితే వీటిని గమనించిన ఓ దొంగ.. గ్యాస్ సిలిండర్లకు ఉన్న ఇత్తడి వాల్వ్‌లు తీసుకునేందుకు ప్రయత్నించాడు. రాడ్డుతో కొట్టి మరీ సిలిండర్ వాల్స్ ను తొలగించబోయాడు. దాంతో సిలిండర్ నుంచి పెద్ద ఎత్తున అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈక్రమంలోనే 15 మీటర్లకుపైగా గాల్లోకి గ్యాస్ వ్యాపించింది. పక్కనే ఉన్న కంపెనీలో పని చేసే 10 మంది బిహార్ కార్మికులకు అస్వస్థత కాగా.. కాలనీలో నివాసం ఉంటున్న మరో ఐదుగురూ అస్వస్థతకు గురయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
గత నెలలోనేబాచుపల్లిలో ప్రమాదం - ఏడుగురికి అస్వస్థత
హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అరబిందో ఫార్మా కంపెనీ లో ప్రమాదం జరిగింది. యూనిట్ 2లో ఈ రోజు సాల్వెంట్ గ్యాస్ లీకైoది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వీరిని స్థానిక ఎస్ఎల్‌జీ ఆసుపత్రిలో చేర్పించారు. ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాచుపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై కంపెనీ యాజమాన్యంతో చర్చించారు. బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీ లో గ్యాస్ లీకేజ్ ఘటనలో కె. శ్రీనివాస రావు, జె.గౌరీ, ఏ.విమల కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ముగ్గురు ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు గౌరీనాథ్, యాస్ మయ్య, ప్రేమ్ కుమార్, ప్రసాద్ రాజ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.