BRS MLAs: మంత్రి కేటీఆర్ నుంచి మాకు పిలుపు రాలేదు, కానీ మొత్తం మల్లారెడ్డి చేశారు: ఎమ్మెల్యే మైనంపల్లి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదన్నారు. ఆయనతో చర్చించేందుకు వారం నుంచి ప్రయత్నిస్తున్నాం, కానీ ఆయన బిజీగా ఉన్న కారణంగా కలవడం సాధ్యం కాలేదన్నారు. .
తన ఇంట్లో పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించామని, మేడ్చల్ జిల్లాలో ప్రస్తుత పరిణామాలపై చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదన్నారు. మంత్రి కేటీఆర్ తో చర్చించేందుకు వారం నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆయన బిజీగా ఉన్న కారణంగా కలవడం సాధ్యం కాలేదన్నారు. . పార్టీ అంతర్గత విషయం అని ఇంట్లో మాట్లాడుకున్నామని, కానీ ఈరోజు మీడియాను ఇక్కడికి పంపించింది మంత్రి మల్లారెడ్డి అని అందరికీ తెలుసునన్నారు. మేడ్చల్ జిల్లాలో పదవులు కేవలం మంత్రికి సంబంధిన వ్యక్తులు, ఆయన సన్నిహితులకే కట్టబెడుతున్నారని.. పదవులు పొందిన వారికే మరోసారి పదవులు ఇవ్వడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయమేనన్నారు.
మంత్రి కేటీఆర్‌ను కలవడంపై చర్చలు..
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సోమవారం సమావేశమయ్యారు. తమకు సంబంధించిన క్యాడర్ కు, మద్దతుదారులకు జిల్లాలో ఏ పదవులు రావడం లేదని, కేవలం జిల్లాకు చెందిన మంత్రి తమ సన్నిహితులకు మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో రాజకీయ పరిణామాలపై, పార్టీలో తాజా పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించాలని ఈ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు మైనంపల్లి తెలిపారు. కేటీఆర్ ను కలవడం ఎలా అంశంపై భేటీ అయిన సమయంలోనే ఇద్దరు నేతలు ఇక్కడికి మీడియాను పంపించారన్నారు. సొంత పార్టీలోనే ఇతరులు ఎదగకుండా చేస్తూ, వారి సన్నిహితులు, క్యాడర్ కు పదవులు ఇవ్వకుండా జిల్లా నాయకత్వం వైఫల్యం చెందిందన్నారు.
‘పనిచేసే వాళ్లకు గుర్తింపు ఇవ్వండి. పనిచేసే వాళ్లను కాపాడుకుంటే ఆ పార్టీని, నేతను ఎవ్వరూ ఏమీ చేయలేరు. పథకాలు మాత్రమే కాదు, కష్టకాలంలో క్యాడర్, లీడర్ పార్టీని కాపాడతారు. కొంతమంది వల్ల పార్టీ క్యాడర్ నిరాశకు లోనైంది. మా అందరి నిర్ణయాన్ని ఈరోజు వెల్లడించాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ విషయాలు తెలుసుకుని సమస్యను పరిష్కారిస్తారని ఆశిస్తున్నాం. రాత్రికి రాత్రే పదవులు కట్టబెట్టడం సరికాదు. గ్రంథాలయ ఛైర్మన్ పదవి రెండోసారి తీసుకున్నారు. మేం జిల్లాకే చెందిన పార్టీ నేతలం. మార్కెట్ కమిటీ చైర్మన్ సైతం వాళ్లకే ఇచ్చారు. కానీ మాకు అసలు అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ పార్టీ కోసం, క్యాడర్ కోసం పార్టీ ఎమ్మెల్యేం సమావేశం అయ్యామని’ మైనంపల్లి హన్మంతరావు వివరించారు.
వివేకానంద, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
కేవలం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేం తమ పరిస్థితిపై చర్చించామన్నారు. అయితే -మేము పార్టీకి వ్యతిరేకం కాదు.. పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడితే వెళ్లి అన్ని విషయాలు చెబుతాం అన్నారు. పార్టీలో ఓ వర్గానికి, జీహెచ్ఎంసీ కి చెందిన నేతలకు పదవులలో అన్యాయం జరుగతుందని చర్చింనట్లు వివేకానంద గౌడ్ తెలిపారు. మేడ్చల్ రూరల్ ఏరియాకు చెందిన వారికి మాత్రమే అవకాశాలు ఇవ్వడంతో మేడ్చల్ జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే వారే నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 36 స్థానాలు నెగ్గామని గుర్తుచేశారు. మరోసారి మన ప్రభుత్వం రావాలని ఉంటుందని, అయితే క్యాడర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడినందున పార్టీ ఎమ్మెల్యేలం సమావేశం అయ్యామని చెప్పుకొచ్చారు.