Wife Missing: భార్య కోసం ఇద్దరు భర్తల వెతుకులాట గుర్తుందా? తాజాగా కీలక ట్విస్ట్.. ఆ ఒక్కటీ అడగొద్దట!
గతంలో ఆ మహిళ చెప్పిన మాదిరిగానే తనకు మొదటి భర్త లేనే లేడని, పిల్లలు కూడా తన పిల్లలు కారని ఆమె మరోసారి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఇద్దరు భర్తలను వదిలి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మొదటి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆ మహిళ ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన ఆ మహిళ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తన రెండో భర్తతో కలిసి వచ్చినట్లుగా పోలీసులు వివరించారు. శనివారం ఆ మహిళ తన రెండో భర్తతో కలిసి ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌కు వచ్చింది.ఎక్కడికి వెళ్లావని తాము అడగ్గా.. ఆమె సరైన సమాధానం చెప్పడం లేదని పోలీసులు తెలిపారు. ఆ ఒక్క సంగతి మాత్రం అడగొద్దని పదే పదే అంటోందని చెప్పారు.
గతంలో ఆ మహిళ చెప్పిన మాదిరిగానే తనకు మొదటి భర్త లేనే లేడని, పిల్లలు కూడా తన పిల్లలు కారని ఆమె మరోసారి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మొదటి భర్త కూడా గాలిస్తున్నందున రెండో భర్తతో కలిసి మహిళే అదృశ్యమైనట్లు నాటకం ఆడిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అసలు కేసు ఏంటంటే..
ఒకే మహిళ కోసం ఇద్దరు భర్తలు గొడవపడుతున్న ఘటనతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆమె నా భార్య అంటే నా భార్య అని ఇద్దరు భర్తలు పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. ఆ మహిళ నాకు కావాలంటే నాకే కావాలంటూ ఇద్దరూ కొట్టుకుంటున్న విచిత్ర ఘటన హైదరాబాద్, వరంగల్‌లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ టీచర్స్ కాలనీ-2 లో లంకా శశికాంత్(42) భార్య దుర్గా సుశీల, అలియాస్ నాగసాయి వెంకట దుర్గా సత్యదేవి(35)తో కాపురం ఉండేవాడు. వీరిద్దరికి 1999 ఫిబ్రవరి 2న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. శశికాంత్ అర్చకుడిగా ఓ దేవాలయంలో పనిచేస్తున్నాడు. వీరికి 16 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కూతురు ఉన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 20న పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన సుశీల మళ్లీ తిరిగి రాలేదు. ఇంట్లోని 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు తీసుకుని ఆమె వెళ్లిపోయింది. భార్య కోసం తెలిసిన చోటల్లా గాలించినా ఆమె ఆచూకి లభించలేదు. చివరికి ఆమె ఏపీలోని అమలాపురం, కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యవరప్రసాద్‌తో వెళ్ళి పోయిందని భర్త శశికాంత్ తెలుసుకున్నాడు.
ఇంట్లోని బంగారం, వెండి డబ్బు తీసుకుని తన భార్య వర ప్రసాద్‌తో పారిపోయిందని భర్త సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గా సుశీలను, ఆమె ప్రియుడు సత్యవరప్రసాద్‌ను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. సుబేదారి పోలీసు స్టేషన్‌లో ముగ్గురి మధ్య రాజీ కుదర్చటానికి ప్రయత్నించారు. దీంతో శశికాంత్ తన మొదటి భర్త కాదని.. తన అక్క చనిపోతే చుట్టపు చూపుగా వెళ్లానని ఆ పిల్లలు తన పిల్లలు కాదని దుర్గా సుశీల భారీ ట్విస్ట్ ఇచ్చింది.
Also Read: Crime News: ఖమ్మంలో స్నేహితుడి దారుణం.. కత్తితో విచక్షణారహితంగా దాడి, కారణం తెలిస్తే షాక్..!
పోలీసులు విచారణ చేపట్టగా.. శశికాంత్ ఆమె భర్తేనని, పిల్లలు సుశీల పిల్లలేనని తేలటంతో వారిద్దరినీ పోలీసులు రిమాండ్ కు పంపారు. జైలు నుంచి విడుదలయ్యాక ప్రియుడు సత్యవరప్రసాద్‌తో కలిసి హైదరాబాద్ బల్కంపేట ప్రశాంత్ నగర్‌లో కాపురం పెట్టి ఇద్దరూ సహజీవనం చేయసాగారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాలలో సుశీల మెడలో ఆమె ప్రియుడు సత్యవరప్రసాద్ మూడు ముళ్లు వేసి భార్యగా చేసుకున్నాడు.
ఈ క్రమంలో శశికాంత్ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిల్లలకు తల్లిప్రేమ కావాలి. నాభార్యను నాకు అప్పగించండి అని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఉండగా రెండో భర్త సత్యవరప్రసాద్ ఇంటి నుంచి సుశీల కనిపించకుండా పోయింది. దీంతో రెండో భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 3 నెలల గర్భవతి అయిన తన భార్య కనిపించటంలేదని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతుండగా.. తాజాగా ఆమె స్టేషన్‌కు వచ్చింది.
Also Read: Crime News: కిలాడీ దంపతులు.. నమ్మకంగా ఉంటూ స్థానికుల నుంచి కోటి రూపాయలకుపైగా అప్పు చేశారు.. ఆ తర్వాత
Also Read: బాలికపై లైంగికదాడి కేసులో పీఠాధిపతి శ్రీరామానంద ప్రభు అరెస్టు.. నల్గొండ జైలుకు తరలించిన పోలీసులు
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి