(Source: ECI/ABP News/ABP Majha)
KTR News: మనం చైనా కంటే వెనకబడినందుకు ఆ మూడే కారణం - కేటీఆర్
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వచ్చాకే వాళ్ల ఊరికి కరెంటు వచ్చిందని, 2022 నాటికి కూడా కరెంటు, నీళ్లు లేని ఇల్లు దేశంలో ఉండడం మన దురదృష్టకరం అని కేటీఆర్ అన్నారు.
మన దేశంలో అద్భుతమైన నాణ్యత ఉందని, ఆ నాణ్యత తక్కువగా ఉన్న చైనా మనకంటే ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. క్వాలిటీ ఉన్న మనం చైనా కంటే ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే చైనాలో కుల, మతాలు లేవని, మన దేశంలో ఈ కాలంలో కులం, మతం పేరుతో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కొట్లాటల వల్లే మన దేశం ఇంకా వెనకబడిపోయి ఉందని అన్నారు. కుల, మతాలు చూడడం ఆపేయాలని చెప్పారు. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఫర్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ నిర్వహిస్తున్న 36 చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
కుల, మతపరమైన మాటలు చెప్పి నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాల్లో మన దగ్గర అధికార పార్టీ ఉందని చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరెంట్ లేక పవర్ హాలీడేలు ఉండేవని, దాంతో మౌలిక సదుపాయాలు కూడా కుదేలయ్యాయని అన్నారు. టీఎస్ ఐ - పాస్‌తో పరిశ్రమల అనుమతులు వేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. 24 గంటల కరెంటు వల్లే పారిశ్రామిక రంగం ముందుకు వెళ్తుందని తెలిపారు. దేశంలో వెనకబడేందుకు కరెంటు కోతలు ప్రధాన కారణమని చెప్పారు.
ఇన్నాళ్లూ ఎందుకు నీళ్లివ్వలేదు - కేటీఆర్
75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకురాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఆఖరికి రాష్ట్రపతి పుట్టిన ఊరికి కూడా ఇటీవల కరెంటు వచ్చిన దుస్థితి ఉందని గుర్తు చేశారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వచ్చాకే వాళ్ల ఊరికి కరెంటు వచ్చిందని, 2022 నాటికి కూడా కరెంటు, నీళ్లు లేని ఇల్లు దేశంలో ఉండడం మన దురదృష్టకరం అని అన్నారు.
మన దేశంలో ఇంత క్వాలిటీ ఉండి కూడా మనకు క్వాలిటీ అనగానే విదేశాలే గుర్తుకు వస్తాయని అన్నారు. భారత్ అంటేనే శక్తివంతమైన దేశం అని, 1986లో చైనా, భారత్ రెండు దేశాల జీడీపీ ఒకేలా ఉండేదని అన్నారు. కానీ, ఇప్పుడు 5.7 శాతం ఎక్కువ వృద్ధి రేటు సాధించిందని అన్నారు. చైనా అంత వృద్ధి రేటు అంత పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయని తెలిపారు. సింగిల్ మైండ్ ఫోకస్ థింగ్స్, ప్రపంచ అతిపెద్ద ఫార్మా క్లస్టర్లతో ముందుకెళ్తోందని చెప్పారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్ నాయకత్వంలో మన రాష్ట్రంలో మౌలిక వసతులు పెరిగాయని, ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఐటీ, ఇండస్ట్రీ సెక్టార్లు దేశంలో మొదటి స్థానంలో నిలిచాయని గుర్తు చేశారు. టీ హబ్ ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది, మొదటి స్థానంలో నిలిచిందని, టీ వర్క్స్ అనే సంస్కరణ గొప్పగా సాగుతోందని అన్నారు. ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ రాక ముందు పరిశ్రమల రంగం, తెలంగాణ వచ్చాక, కేటీఆర్ పరిశ్రమల మంత్రి అయ్యాక ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.