Hyderabad Metro Charges: మెట్రో రైల్ ఛార్జీల పెంపునకు అంతా రెడీ, ఎంత పెంచాలో మీరూ చెప్పొచ్చు - ఇలా చేయండి
ప్రస్తుత ఛార్జీల పెంపునకు సంబంధించి పౌరులు, మెట్రో ప్రయాణికులు తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15లోగా తెలపవచ్చని కమిటీ ఛైర్మన్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
నిత్యావసరాలు సహా అన్ని ధరలు, ఛార్జీలు పెరుగుతూ సామాన్యుడికి బరువుగా మారుతున్న వేళ ఇప్పుడు హైదరాబాద్‌లో మెట్రో రైలు ఛార్జీలు కూడా త్వరలో ఎగబాకనున్నాయి. టికెట్ రేట్లను పెంచడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఛార్జీలను పెంచడానికి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఛార్జీల సవరణలో భాగంగా ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నాయి. ఆసక్తికల వారు తమ అభిప్రాయాలను పంపవచ్చని మెట్రో అధికారులు తెలిపారు.
కమిటీలో ఎవరెవరు ఉంటారంటే
హైకోర్టు విశ్రాంత జడ్జి గుడిసేవ శ్యామ్ ప్రసాద్ ఛైర్మన్‌గా ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి వ్యవహరిస్తారు. కేంద్ర గృహ, పట్టణ వ్వవహారాల మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్డె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ మెంబర్లుగా కమిటీని నియమించారు.
ప్రస్తుత ఛార్జీల పెంపునకు సంబంధించి పౌరులు, మెట్రో ప్రయాణికులు తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15లోగా తెలపవచ్చని కమిటీ ఛైర్మన్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ffchmrl@gmail.com అనే మెయిల్ ఐడీకి గానీ, లేదా పోస్టు ద్వారా కానీ అభిప్రాయాలు పంపవచ్చు. పోస్టు ద్వారా పంపేవారు ‘ఛైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట, 500003 చిరునామాకు పంపాలని అధికారులు చెప్పారు.
చట్ట ప్రకారం కమిటీకే ఛార్జీల పెంపు అధికారం
మెట్రో రైలు చట్టం ప్రకారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ (ఎంఆర్‌ఏ)కు తొలిసారి చార్జీలు మాత్రమే నిర్ణయించే అధికారం ఉంటుంది. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో మెట్రోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుంటాయి కాబట్టి వారే మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ గా ఉంటారు. హైదరాబాద్‌లోని మెట్రో ప్రాజెక్టును పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో చేపట్టారు కాబట్టి.. ఇక్కడ మెట్రో వ్యవస్థను నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థే నడుపుతోంది. కాబట్టి హైదరాబాద్ మెట్రోకు ‘ఎంఆర్‌ఏ’గా ఎల్ అండ్ టీనే ఉంది. ఆ మేరకు ఎల్ అండ్ టీ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి రైలు సర్వీసుల ప్రారంభంలో మాత్రమే మెట్రో ఛార్జీలను పెంచే అధికారం ఉంది.
సవరించాలంటే మాత్రం చట్ట ప్రకారం కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్ కమిటీకే సాధ్యం అవుతుంది. ఫేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించాలని హైదరాబాద్ మెట్రో సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో గత నెలలో కమిటీ ఏర్పాటు జరిగింది. అయితే, ఛార్జీలు ఎంత పెంచాలనేది సొంతంగా కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ తమ ప్రతిపాదనలను కమిటీకి అందజేయనుందని, ప్రయాణికుల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
ప్రస్తుత ఛార్జీలు ఇలా..
మెట్రోలో టిక్కెట్ ప్రస్తుతం కనిష్ఠం రూ.10 గా ఉంది. గరిష్ఠంగా రూ.60గా ఉంది. 2017 నవంబరు 28న మెట్రో సర్వీసులు ప్రారంభమైనప్పుడు ఈ ఛార్జీలను నిర్ణయించి ప్రకటించారు. అప్పట్లో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ ఛార్జీలను నిర్ణయించింది. అప్పుడే ఈ ఛార్జీలు ఎక్కువనే విమర్శలు వచ్చాయి. తాజాగా ధరలు పెంచుతుండడంతో మళ్లీ వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు.