Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్, ఆ ఆఫర్ రద్దు
Hyderabad News: ఎండల తీవ్రతతో మెట్రో రైల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడం వల్లే హాలిడే స్మార్ట్ కార్డ్ ఆఫర్ ను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది.
Hyderabad Metro News: హైదరాబాద్ లో తరచూ మెట్రో రైలులో ప్రయాణించే వారికి అలర్ట్. ఇప్పటివరకూ ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ ప్రయాణికులకు టికెట్ పై అందిస్తూ వచ్చిన రాయితీ, ఆఫర్ ను రద్దు చేసింది. రూ.59 హాలిడే కార్డుగా పిలిచే ఆఫర్ ను వెనక్కు తీసుకుంది. మార్చి 31తో హాలిడే కార్డు ఆఫర్ ముగిసిందని అధికారులు తెలిపారు. ఈ కార్డుతో రూ.59 చెల్లించి ఒక రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించడానికి వీలుండేది. ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇంకా సెలవు రోజుల్లో ఈ ఆఫర్ చెల్లుబాటు అయ్యేది.
చాలా కాలం నుంచి మెట్రో ప్రయాణికులు ఈ హాలిడే కార్డు రాయితీని పొందుతూ వచ్చారు. దీన్ని రద్దు చేయడంతో తాజాగా ఇకపై ఈ రాయితీ వర్తించదు.
అయితే, ఎండల తీవ్రతతో మెట్రో రైల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడం వల్లే హాలిడే కార్డ్ ఆఫర్ ను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. మెట్రో సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.