Shamshabad Airport Metro Route Map: హైదరాబాద్ మెట్రో రెండో దశలో అడ్డంకి, ఇంజినీర్లకు సవాల్ గా మారిన మైండ్ స్పేస్ జంక్షన్
Shamshabad Airport Metro Route Map: దేశంలో సక్సెస్ అయిన మెట్రో సర్వీసులలో హైదరాబాద్ ఒకటి. కొన్ని రోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Shamshabad Airport Metro Line Issues: హైదరాబాద్ మెట్రో రైలు ఇటీవల 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంది. దేశంలో సక్సెస్ అయిన మెట్రో సర్వీసులలో హైదరాబాద్ ఒకటి. కొన్ని రోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో సర్వీస్ విస్తరించనున్నట్లు శుభవార్త చెప్పారు. తాజాగా మెట్రో ఇంజినీరింగ్ అధికారులు మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు సవాల్ గా నిలిచాయి.
రెండో ఫేజ్ లో హైదరాబాద్ మెట్రో లైన్ వెళ్లే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్‌వరకు ఉన్న పనులు ఇంజినీరింగ్పరంగా అతి క్లిష్టమైనవని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో మెట్రో సాంకేతిక సవాళ్లను ఎదుర్కొక తప్పదని భావిస్తున్నారు. 21 మీటర్ల ఎత్తులో రాయదుర్గ్, మైండ్ స్పేస్ జంక్షన్‌ను దాటడం ఒక పెద్ద సవాల్‌తో కూడుకున్న విషయం అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
బెస్ట్ ఇంజినీరింగ్సొల్యూషన్ కోసం రెండో ఫేజ్ మెట్రో లైన్ రూట్ మ్యాప్ పరిశీలించగా.. అంత ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్‌ను దాటడం ఒక పెద్ద సవాల్ అని గుర్తించారు. ఈ జంక్షన్ వద్ద కింద నుంచి అండర్‌పాస్ వే ఉండగా, మధ్యలో రోటరీ, ఆ పైన ఫ్లై ఓవర్ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నాయని గుర్తుచేశారు. ఈ సవాల్ ను అధిగమించేందుకు పరిష్కారంగా ప్రత్యేకమైన స్పాన్‌ని అక్కడే నిర్మించేలా పరిశీలించినట్లు చెప్పారు. ఇక్కడి నుంచి మొదలయ్యే మెట్రో లైన్వెళ్లే ఎయిర్‌పోర్టు మెట్రో పిల్లర్లను ఫ్లైఓవర్ పిల్లర్లకు దూరంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో మరో 31 కిలోమీటర్లు
రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంలో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు అని తెలిసిందే. ఫేజ్ 1 లో భాగంగా మొత్తం 69 కిలోమీటర్ల మెట్రో లైన్ ఉంది. ఫేజ్ 2లో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ విస్తరించనున్నారు. నాగోల్ - రాయదుర్గం కారిడార్ 3కి కొనసాగింపుగా ఎయిర్ పోర్ట్ వరకు ఫేజ్ 2 మెట్రో రూట్ మ్యాప్ పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయం వరకు కనెక్ట్ చేయనున్న హైదరాబాద్ మెట్రో లైన్ కోసం రూ.6250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తోంది.
హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం అందించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్ ఫేజ్ టూ, ఫేజ్ వన్ కారిడార్ నెంబర్ 3 ( నాగోల్ -ఎల్బీనగర్) విస్తరణకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్, లక్డీకాపూల్ మధ్య 26 కిలోమీటర్ల ( 23 స్టేషన్లతో ) ఎల్బీనగర్ – నాగోల్ మధ్య (4 స్టేషన్లతో 5 కిలోమీటర్ల మేర) మెట్రోను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని కేటీఆర్ లేఖలో తెలిపారు.