(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
పెద్ద బండను చూసి సంబరపడి దానిపైకి ఎక్కాడు. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలోకి పడిపోయాడు. బయటకు రాలేక కేకలు వేశాడు.
సరదా పడి ఓ యువకుడు ఓ పెద్ద బండ రాయి ఎక్కాడు. పట్టుతప్పి రెండు రాళ్ల ఉన్న తొర్రలోకి జారి పడిపోయాడు. దాదాపు 3 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న పోలీసులు అతణ్ని రక్షించారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రాజు అనే 26 ఏళ్ల వ్యక్తి బతుకు దెరువుకోసం హైదరాబాద్ నగరానికి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలా సోమవారం సాయంత్రం తిరుమలగిరి కెన్ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసి సంబరపడి దానిపైకి ఎక్కాడు. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలోకి పడిపోయాడు. బయటకు రాలేక కేకలు వేశాడు. స్థానికులు గుర్తించి తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు కానిస్టేబుల్స్ రాంబాబు భాష రాజు ఘటన స్థలానికి చేరుకొని రాజును కాపాడారు. అనంతరం చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అయిన తర్వాత తన స్వగ్రానికి వెళ్తానని రాజు అనడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు వదిలేశారు. కానిస్టేబుల్, సీఐ శ్రవణ్ కుమార్ కి బాధితుడు ధన్యవాదాలు చెప్పాడు.
గత డిసెంబరులో కామారెడ్డిలో ఇలాంటి ఘటనే..
కామారెడ్డి జిల్లాలోని సింగరాయిపల్లిలో ఇలాంటి ఘటనే గత డిసెంబరు నెలలో జరిగింది. గుహ లోపల బండరాళ్ల మధ్య చిక్కుకొని ఓ వ్యక్తి నరకయాతన అనుభవిస్తున్నాడు. బయటకు కాళ్లు మాత్రమే కనిపించాయి. 40గంటలుగా రాజు అనే వ్యక్తి బండరాళ్ల మధ్య గుహలో ఇరుక్కుపోయి.. తలకిందులుగా చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరయ్యాడు. 40 గంటలుగా నీళ్లు లేక, ఆహారం లేక అలమటించాడు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయాడు. బండ నెర్రెలో పడిపోయిన ఫోన్ తీసేందుకు యత్నించి మరింత లోతుకు వెళ్లిపోయాడు. ఎంత ప్రయత్నించినా రాజు బయటకు రాలేకపోయాడు. తనను కాపాడాలంటూ అరుపులు కేకలు వేశాడు. రాజు అరుపులు విన్న కొందరు స్థానికులు.. అతణ్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోకపోయింది. అతని స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అగ్నిమాపక, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజును రక్షించే ప్రయత్నం చేశారు. జేసీబీల సాయంతో రాళ్లను తొలగించడానికి యత్నించారు.
రాజు బయటకు రాకపోవడంతో అతని స్నేహితుడు అశోక్ గుహలోకి దిగాడు. మధ్యలో దాకా వెళ్లి ధైర్యం చెప్పి వచ్చాడు. చివరికి జిల్లా ఉన్నత యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగి అధునాత యంత్రాలను తెప్పించి బండరాళ్లను పక్కకు తొలిచారు. మొత్తానికి ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత రాజును అధికారులు కాపాడగలిగారు.
43 గంటలకుపైగా గుహలోనే..
రెండు రోజుల క్రితం మధ్యాహ్నం రాజు వేటకు వెళ్లాడని అతని భార్య అప్పట్లో మీడియాకు చెప్పింది. అయితే సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశామని లిఫ్ట్ చేయడం లేదని వివరించింది. స్పందించకపోవడంతో అడవికి వెళ్లి కుటుంబ సభ్యులు వెతకడంతో ఈ గుహలో ఉన్నాడని గుర్తించారు. రాజును సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ బృందానికి బాధితుడి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.