Hyd Biodiversity - సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ నివేదిక తయారు చేసిన సిటీగా హైదరాబాద్
ఒక నగరం కోసం ప్రత్యేకంగా బయోడైవర్సిటీ ఇండెక్స్ నివేదికను తయారు చేసిన ఏకైక ఇండియన్ సిటీగా హైదరాబాద్ ఘనత సాధించింది.
హైదరాబాద్ నగర జీవవైవిధ్య సూచీని (City Biodiversity Index) మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఒక నగరం కోసం ప్రత్యేకంగా బయోడైవర్సిటీ ఇండెక్స్ నివేదికను తయారు చేసిన ఏకైక ఇండియన్ సిటీగా హైదరాబాద్ ఘనత సాధించింది. గతంలో 2012లో (COP 11 సమావేశం) సందర్భంగా హైదరాబాద్, 2017లో కోల్ కత్తా ఒకసారి నగర జీవవైవిధ్య సూచిని రూపొందించాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బయోడైవర్సిటీ ఇండెక్సును తిరిగి రెండోసారి రూపొందించిన నగరంగా హైదరాబాద్ రికార్డులకు ఎక్కింది. నగరంలో ఉన్న జీవవైవిధ్య పరిరక్షణ, పర్యవేక్షణ, అభివృద్ధికి ఈ ఇండెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బయోడైవర్సిటీ రంగంలో సింగపూర్ చేసిన భాగస్వామ్యానికి గుర్తింపుగా దీన్ని సింగపూర్ ఇండెక్స్ పేరుతో పిలుస్తున్నారు.
ఇవీ హైదరాబాద్ జీవవైవిధ్యానికి ఉన్న అనకూల అంశాలు
సరస్సుల నగరంగా, ఉద్యానవనాల నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ప్రస్తుతం దాదాపు 2వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న 1350కి పైగా జలవనరులు ఉన్నాయి. 1,600 హెక్టార్లలో సహజ రాళ్లగుట్టలు (రాక్ ఫార్మేషన్స్) విస్తరించాయి. రెండు జాతీయ పార్కులు( కేబీఆర్, హరిణి వనస్థలి) జీవవైవిధ్యానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఈ నివేదికలో తేలింది. దీంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిశాట్ వంటి సంస్థలకు ఉన్న సువిశాలమైన క్యాంపస్‌లు జీవవైవిధ్యానికి ఆలవాలంగా మారాయని తేలింది. ఇవన్నీ నగర జీవవైవిధ్య సూచీలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు అవకాశం కలిగింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో 1,305 వృక్షజాతులు ఉండగా, 577 ప్రాంతీయ వృక్ష జాతులు, 728 ఇతర ప్రాంత వృక్షజాతులు ఉన్నాయని తేలింది. 30 రకాల తూనీగ జాతులు (odonates),141 జాతుల సీతాకోక చిలుకలు, 42 రకాల సాలీడు పురుగులు, 60 రకాల చేపలు, 16 రకాల (amphibians) ఉభయచర జీవులు, 41 రకాల సరీసృపాలు, 315 పక్షి జాతులు, 58 క్షీరదాలు (mammalian) ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది.
ఐదేళ్ల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాలి-మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా జీవవైవిధ్య సూచీ నివేదికను తయారుచేసిన అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రపంచ స్థాయి నగరంగా మారే పరిణామక్రమంలో జీవవైవిధ్యం అత్యంత కీలక అంశమని కేటీఆర్ అన్నారు. జీవించు- జీవించనివ్వు అన్న స్ఫూర్తి ఆధారంగా నగరీకరణ జరిగినప్పుడే ప్రకృతితో మమేకమై బతకగలిగే పరిస్థితి ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన హరితహారం, చెరువుల సంరక్షణ - బలోపేతం, అడవుల పెంపకం, అర్బన్ లంగ్ స్పేసెస్ వంటి అభివృద్ది కార్యక్రమాలు నగర జీవవైవిధ్యానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని, నగరం చుట్టుపక్కల కూడా జీవివైవిధ్యం మరింత పెరుగుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అన్ని పురపాలికల్లో జీవవైవిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతోందని కేటీఆర్ అన్నారు. పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీల ఏర్పాటు వంటి అనేక ఇతర హరిత కార్యక్రమాలకు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్థావించారు. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ఐదేళ్ల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రజల్లో బయోడైవర్సిటీ పట్ల మరింత అవగాహన పెంచేలా చర్యలు చేపడతామన్నారు. జూన్ 5వ తేదీన పట్టణాల్లో హరితాన్ని పెంచిన పురపాలికలకు, వాటి సిబ్బందికి ప్రత్యేకంగా హరిత అవార్డులు అందజేస్తామని మంత్రి వెల్లడించారు.