Hyderabad: మనవళ్లను కిడ్నాప్ చేసిన సొంత అమ్మమ్మ! కన్నకూతురి నుంచి 30 లక్షల డిమాండ్
ఓ పెద్దావిడ సొంత మనవళ్లనే కిడ్నాప్ చేసింది. అంతేకాకుండా తనకు రూ.30 లక్షలు డబ్బులు ఇస్తేనే మనవళ్లను వెనక్కు పంపుతానని కూతురిని డిమాండ్ చేసింది.
డబ్బులపై ఆశతో ఓ పెద్దావిడ నేరానికి సైతం వెనుకాడని ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఏకంగా ఆమె తన సొంత మనవళ్లనే కిడ్నాప్ చేసి, క్షమించరాని నేరం చేసింది. కిడ్నాప్ చేయడమే కాకుండా తనకు రూ.30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ బెదిరింపులు ఏకంగా తన కూతురికే చేసింది. లేదంటే మనవళ్లను చంపేస్తానని భయపెట్టింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బాధితురాలైన మహిళ తన పిల్లలను తన తల్లే కిడ్నాప్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మియాపూర్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్‌లోని మదీనాగూడలో రూహీ అనే ఒక డాక్టర్ నివాసం ఉంటోంది. ఈమెకు గత 10 ఏళ్ల క్రితం ముదాసర్ అలీ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఏడాది క్రితం ముదాసర్ అలీకి హార్ట్ ఎటాక్ రావడంతో చనిపోయాడు. వీరికి 8 ఏళ్ల వయసున్న అర్ఫాన్, ఐదేళ్ల వయసున్న అర్హాన్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త అలీ ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో.. డాక్టర్ రూహీ తన తల్లి ముంతాజ్, అక్క రోషనాతో కలిసి మదీనాగూడలోనే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఆస్తి మీద తల్లి ముంతాజ్ కన్నేసింది. తల్లి, అక్క కలిసి గత జనవరిలో ఇద్దరు పిల్లలను తీసుకొని వారి సొంత ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి రూహీకి చెప్పకుండా తీసుకెళ్లిపోయారు.
అప్పటి నుండి పిల్లలను తల్లి రుహీ నుంచి దూరంగా ఉంచారు. పిల్లలు సొంతూరు నుంచి ఎంతకీ రాకపోవడంతో.. రుహీ తన పిల్లల కోసం సత్తుపల్లి వెళ్లింది. దీంతో అక్కడ బంధువులందరూ ఆమెపై దాడి చేసి కారును కూడా లాగేసుకొని పంపించేశారు. దీంతో తల్లితో పాటు ఇతర మిగతా కుటుంబ సభ్యులపైన రుహీ బుధవారం రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కిడ్నాప్ కేసుగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
కేసు విచారణలో భాగంగా గురువారం మియాపూర్ పోలీసులు రుహీ దగ్గరి బంధువైన సలీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. బాధితురాలు రుహీ మానసిక పరిస్థితి సరిగా లేదని, పిల్లలను పట్టించుకోవడం లేదని వారి భవిష్యత్తు కోసమే తాము సొంతూరికి తీసుకెళ్లామని రుహీ తల్లి ముంతాజ్ పోలీసులతో చెప్పింది. పిల్లల అమ్మమ్మగా తమకు సర్వ హక్కులు కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు రుహీ తల్లి ముంతాజ్ పోలీసులతో తెలిపింది. దీంతో పోలీసులు ఈ కేసు వ్యవహారంలో ఎవరి వాదన నిజం అనే కోణంలో మరింత విచారణ చేపట్టనున్నారు.