Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
Hyderabad Crime News: ప్రేమించానన్నాడు. నమ్మి పెద్ద వాళ్లను ఎదరించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లై, పిల్లలు పుట్టినప్పటి నుంచి వరకట్నం కోసం వేధిస్తున్నాడు. అది తాళలేని మహిళ ఆత్మహత్య చేసుకుంది.
Hyderabad Crime News: అతడో పోలీస్ కానిస్టేబుల్. ఓ యువతి వెంట పడి మరీ ప్రేమించానన్నాడు. నువ్వు లేకపోతే బతకలేనంటూ మాయ మాటలు చెప్పాడు. నమ్మిన యువతి కూడా అతగాడి ప్రేమలో పడిపోయింది. పెద్దలను ఎదరించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లై ఓ పాప పుట్టికా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే వరకట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అధి తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.
అసలేం జరిగిందంటే..?
తిరుమలగిరి ఎస్బీహెచ్ కాలనీలో వడ్ల శ్రీనివాస్, రేణుక దంపతులు నివసించేవారు. అయితే వీరి 27 ఏళ్ల కుమార్తె పవిత్ర తిరుమలగిరి ఠాణాలో పని చేసే కె. అవనాశ్ ను ప్రేమించింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ 2016 జూన్ 6వ తేదీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరూ కలిసి మలక్ పేటలోని బీ-బ్లాక్ ప్రాంతంలో కాపురం పెట్టారు. వీరికి ఐదేళ్ల అవిక్షిత అనే కుమార్తె ఉంది. అవినాశ్ మద్యానికి బానిసై తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. యువతి ఆమె కుటుంబ సభ్యులు మహిళా ఠాణాను ఆశ్రయించగా.... అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అతని తీరులో ఎలాంటి మార్పు లేదు. రెండు నెలల కిందట ప్రవర్తన మార్చుకుంటా, భార్యను, కూతురును చక్కగా చూసుకుంటానని చెప్పాడు. అతనికి అత్తింటివారు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ కట్టి కారు కూడా కొనిచ్చారు. ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అవినాశ్.. పవిత్రతో గొడవ పడ్డాడు. సాయంత్రం పవిత్ర ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది జులైలో కూడా ఇలాంటి ఘటనే
వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వరకట్నం అడగడం నేరమని తెలిసినా చాలా మంది యథేచ్ఛగా కట్నం అడుగుతున్నారు. పెళ్లికి ముందు ఇచ్చినంత తీసుకోవడం లేదా ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరగక పోతే అదనంగా కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. తీవ్రంగా చిత్రహింసలు పెడుతున్నారు. అటు భర్త, ఇటు అత్తమామలు, ఆడ పడచులు తీవ్రంగా వేధిస్తున్నారు. కట్నం తీసుకురావాలని శారీరకంగా వేధిస్తున్నారు. కట్నం తీసుకురావాలంటూ భార్యలను భర్తలు తీవ్రంగా కొడుతున్నారు. వారు పెట్టే హింస భరించలేక చాలా మంది మహిళలు తనువు చాలిస్తున్నారు. 100 మందిలో ఒకరో, ఇద్దరో మాత్రమే భర్తలు, అత్తింటి వారిపై పోలీసు కేసు పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో వరకట్న వేధింపులు భరించలేక మరో మహిళ తనువు చాలించింది.
వేధింపులు భరించలేక సునీత ఆత్మహత్య
హైదరాబాద్ శివారు గచ్చిబౌలి శివారులో సునీత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం తీసుకు రావాలంటూ భర్త, అత్త మామలు ఆమెను తీవ్రంగా వేధించారు. శారీరకంగా, మానసికంగా ఆమెను హింసించారు. సునీతను భర్త తీవ్రంగా కొట్టేవాడు. ఈ వేధింపులు భరించలేకే సునీత సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే విజయనగరానికి చెందిన సునీతకు అదే ప్రాంతానికి చెందిన రమేశ్ తో 2019లో పెళ్లి జరిగింది. రమేశ్ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో రమేశ్ కు బంగారంతో పాటు రూ.1 4 లక్షలు నగదు, 20 సెంట్ల భూమి ఇచ్చారు. అయినా రమేశ్ అదనపు కట్నం కోసం వేధించాడు.