Hyderabad Crime News: ఉప్పల్లో దారుణం - ప్రేమను తిరస్కరించిందని యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది
Hyderabad Crime News: తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో యువతి గొంతు కోశాడో వ్యక్తి. చాకచక్యంగా తప్పించుకున్న యువతి నేరుగా వెళ్లి ఆస్పత్రిలో చేరింది.
Hyderabad Crime News: ఆమెకు రీల్స్ చేయడం అలవాటు. ఈక్రమంలోనే ఎడిటింగ్ చేసే ఓ వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అతడు తరచుగా ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పాడు. ఆమె అవేమీ పట్టించుకోకుండా నో చెబుతూ వస్తోంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అతడు మాత్రం ఆమెను చంపేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి గొంతు కోశాడు. చాకచక్యంగా తప్పించుకున్న యువతి నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. ప్రస్తుతం చికిత్స పొందుతుండగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
లక్ష్మీ నారాయణ అనే యువకుడు హైదరాబాద్ లో ఉంటూ సినీ పరిశ్రమలో వీడియో ఎడిటర్ గా పని చేస్తున్నాడు. అయితే బాధిత యువతికి రీల్స్ చేసే అలవాటు ఉంది. ఈక్రమంలోనే ఎడిటింగ్ కోసం ఇతగాడి సాయం తీసుకునేది. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం రోజురోజుకూ ఎక్కువవడంతో ఆమెపై ప్రేమ పెంచుకున్న లక్ష్మీ నారాయణ.. సదరు యువతి వద్ద తరచుగా ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చేవాడు. అప్పటికే లక్ష్మీ నారాయణకు పెళ్లి కావడంతో యువతి తిరస్కరించింది. మరోవైపు ఈ మధ్యనే బాధితురాలకి సినిమాల్లో అవకాశం కూడా వచ్చింది. షూటింగ్ సమయాల్లో ఇతరులతో చనువుగా ఉంటూ తనను దూరం పెడుతుందని భావించిన లక్ష్మీనారాయణ.. ఆమెపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఆమెను చంపేయాలని ప్లాన్ వేశాడు.
పథకం ప్రకారం మాట్లాడాలని ఉందంటూ సదరు యువతిని శనివారం రోజు ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్ కు రమ్మని చెప్పాడు. స్నేహితుడే కదా అని వెళ్లిన ఆ యువతి వద్ద లక్ష్మీ నారాయణ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె తిరస్కరించడంతో కోపంతో తన వెంట తెచ్చుకున్న చిన్న కత్తితో యువతి గొంతు కోశాడు. కారులో దారుణానికి పాల్పడగా.. యువతి చాకచక్యంగా తప్పించుకుంది. కారు దిగి పరుగులు తీసింది. నేరుగా వెళ్లి ఆస్పత్రిలో చేరుంది. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. కూతురుపై దాడి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.