Car Accident Update: కారు దుర్ఘటనలో నిందితుడు ఇతనే, కీలక వివరాలు చెప్పిన పోలీసులు - ట్విస్ట్ ఏంటంటే!
శాంతి నగర్ లో నివాసం ఉంటూ నిందితుడు అవినాష్ కాలేజీలో బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇతరి దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్సే లేదని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లోని సన్ సిటీ దగ్గర్లో బండ్లగూడ జాగీర్ వద్ద జరిగిన కారు ప్రమాద దుర్ఘటనలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని బద్రుద్దీన్ ఖాదిర్ అని గుర్తించారు. నార్సింగి పోలీసులు ఇతణ్ని అరెస్టు చేయగా.. కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. యువకుడు బద్రుద్దీన్ వయసు 19 ఏళ్లు. స్థానిక శాంతి నగర్ లో నివాసం ఉంటూ అవినాష్ కాలేజీలో బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇతరి దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్సే లేదని పోలీసులు గుర్తించారు.
తన పుట్టిన రోజు జరుపుకోడానికి ఇంకో ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం (జూలై 4) ఉదయం మాసబ్ ట్యాంక్ నుంచి మొయినాబాద్ వైపు AP09 BJ 2588 నెంబరు హోండా సివిక్ కారులో బయల్దేరాడు. బండ్లగూడ సన్ సిటీ దగ్గరికి రాగానే వేగంగా వెళ్తున్న కారు మూల మలుపు వద్ద నియంత్రణ కోల్పోయి వాకింగ్ చేస్తున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. ఆ తర్వాత సమీపంలో ఉన్న మరో వ్యక్తిని ఢీకొని పక్కనే తుప్పల్లోకి దూసుకుపోయింది. ఇదంతా రెప్పపాటు వ్యవధిలో జరిగిపోయింది.
ఈ ఘటనలో అనురాధ అనే మహిళ, ఆమె కుమార్తె మమత అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన కవిత, ఇంతియాజ్ అనే వ్యక్తులను స్థానికులు, పోలీసులు కలిసి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జు నుజ్జు అయింది. కారును క్రేన్ సాయంతో బయటకు తీయించారు.
సెకండ్ హ్యాండ్ లో కారు అమ్మినా, మారని పేర్లు
ఈ ప్రమాదానికి కారణమైన హోండా సివిక్ కారు సెకండ్ హ్యాండ్ లో నిందితుడు కొన్నాడు. అంతకుముందు ఉన్న ఓనర్ల నుంచి కారు చేతులు మారినా, పత్రాల్లో పేరు మాత్రం మారలేదని తెలుస్తోంది. గతంలో ఈ కారు మహ్మద్ ఇంతియాజ్ అనే వ్యక్తి వద్ద ఉండేది. అతను ఆన్‌లైన్‌లో అమ్మేశాడు. ఓఎల్‌ఎక్స్ డీలర్ నుంచి మరో వ్యక్తి ఆ కారు కొనుగోలు చేశాడు. ఆ వ్యక్తి నుంచి బద్రుద్దీన్ ఖాదిరి కారు కొన్నాడు. ఇది జరిగి చాలా కాలం అయినా ఆ హోండా కారు పేపర్లు తొలి యజమాని అయిన ఇంతియాస్ పేరు మీదనే ఉన్నాయి. దీంతో అతణ్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.