Madhavi Latha: రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
Hyderabad BJP MP Candidate Madhavi latha: హైదరాబాద్ లోక్ సభ స్థానంలో పలుచోట్ల రిగ్గింగ్ జరిగిందని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత సంచలన ఆరోపణలు చేశారు. రాక్షజ రాజ్యానికి అంతం లేదా అని ప్రశ్నించారు.
Telangana Elections 2024: హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తరువాత ఎంఐఎం నేతలు రిగ్గింగ్ చేశారని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత (BJP MP Madhavi Latha) సంచలన ఆరోపణలు చేశారు. చంద్రాయణ్ గుట్టలోని రియాసత్ నగర్ బూత్ నంబర్ 40లో రిగ్గింగ్ జరిగిందని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో ఒక్క అధికారి, పోలీసు కూడా అక్కడ లేరని పేర్కొన్నారు. హిజాబ్ ధరించి ఉన్న దాదాపు 150కి పైగా యువతులు, మహిళల్ని వేరే చోటు నుంచి తీసుకొచ్చి వారితో దొంగ ఓట్లు వేయిస్తున్నారని సమాచారం అందగానే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ పదే పదే హిట్లర్ పేరు ప్రస్తావిస్తారు.. హిట్లర్ రాజ్యమంటే ఇలాగే ఉంటుందంటూ మండిపడ్డారు. బతికున్న ఎంతో మందిని చనిపోయారని చెబుతూ ఓటు వేయకుండా అడ్డుకున్నారని, రాక్షస రాజ్యానికి అంతం లేదా? అని ప్రశ్నించారు.
ఎంత పిలిచినా తలుపులు తెరవలేదు..
తాను పోలింగ్ బూత్ కు వెళ్లగా రిగ్గింగ్ జరిగినట్లు గుర్తించానని, అక్కడ పోలీసులు, అధికారులు లేరని మాధవీ లత తెలిపారు. కిటికీల నుంచి వీడియోలు తీయగా.. రిగ్గింగ్ జరిగినట్లు, లోపలు మనుషులు ఉన్నట్లు గుర్తించామన్నారు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎంఐఎం మనుషులు, పోలీసులు వస్తున్నారని.. సెక్యూరిటీగా బీజేపీ కార్యకర్తలు ఉంటే, వారిపై సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని మీడియాకు తెలిపారు. పోలీసులు సైతం వారికి మద్దతుగా నిలిచారని, గంటసేపు తాను అక్కడే ఉండగా.. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వచ్చి ఎంత సేపు డోర్ కొట్టినా, పిలిచినా లోపల నుంచి ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. ఎక్కడైనా పోలింగ్ బూత్ మీద ఇళ్లు ఉంటుందా, ఇక్కడ అందుకు భిన్నంగా ఉందని చెప్పారు.
మొఘల్ పురాలో అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో 500 మంది కలిసి ర్యాలీ చేశారు. తన మీద ఇష్టం ఉన్నట్లు అరుస్తూ బండ బూతులు తిడుతూ దుర్మార్గంగా ప్రవర్తించినట్లు తెలిపారు. వెంటనే సీఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించి తనను సేఫ్ గా కారులో తరలించారని చెప్పుకొచ్చారు. గోల్డెన్ జూబ్లీ స్కూళ్లో ఓ మైనర్ ను పట్టుకోగా, మైనర్ అని రాస్తామన్నారు. ఈరోజు హాలిడే అని రేపు కేసు నమోదు చేస్తామని చెబుతున్నారని వాపోయారు. కొందరు పోలింగ్ బూత్ లో ఓటు వేసి బయటకు వచ్చాక, షర్ట్ మార్చుకుని వెళ్లి మరో ఓటు వేసి రావడం చూశామన్నారు.
ఇప్పుడు అసలైన పాదయాత్ర చేస్తా.. మాధవీ లత
ఇది ప్రజాస్వామ్యం కాదా, 21వ శతాబ్దంలో లేమా అని మాధవీ లత ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేస్తున్నారని, మీరు చెక్ చేయండని చార్మినార్ ప్రాంతంలో లేడీ కానిస్టేబుల్ ను తాను అడగగా.. తమకు ఎలాంటి సూచనలు లేవని, తమకు సంబంధం లేదని చెప్పడాన్ని తప్పుపట్టారు. బురఖా తీసి చెక్ చేయాలని కోరగా, ప్రిసైడింగ్ ఆఫీసర్ కు తమ సహాయం కావాలని అడిగితే మాత్రమే చెక్ చేస్తామన్నారు. లేకపోతే అక్కడ రిగ్గింగ్ జరిగినా, దొంగ ఓట్లు వేసినా, దుర్మార్గం జరిగినా చూస్తు కూర్చుంటామన్నట్లు పోలీసులు వ్యవహరించారని మాధవీ లత ఆరోపించారు. ఇన్ని రోజులు తాను చేసింది పాదయాత్ర కాదని, ఓట్లు డిలిట్ అయిన వారి వివరాలు తీసుకుని ఇంటింటికి పాదయాత్ర చేసి చూపిస్తానన్నారు. ప్రతి బూత్ లో 150 నుంచి 200 హిందువుల ఓట్లు తొలగించారని, ఈ అన్యాయాలను చూస్తూ సహించేది లేదన్నారు. చనిపోయారని చెబుతూ బతికున్న హిందువుల ఓట్లను తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు.