(Source: ECI/ABP News/ABP Majha)
Eatala On Preethi Issue: ఆయన సకాలంలో స్పందించి ఉంటే ప్రీతి పరిస్థితి వేరేలా ఉండేది: ఈటల రాజేందర్
మెడికల్ కాలేజీలలో ఏంజరుగుతుందో తెలియడానికి ప్రీతి ఉదంతం ఒక సంఘటన మాత్రమే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థిని ప్రీతిని చూశారు. ఆమె తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను ఆదివారం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం నిమ్స్ మీడియా పాయింట్ లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలలో ఏంజరుగుతుందో తెలియడానికి ప్రీతి ఉదంతం ఒక సంఘటన మాత్రమే అన్నారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ లేదు అని చెప్తున్నా, అందులో వాస్తవం లేదన్నారు.
‘తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరిగాయి. కానీ పెరిగిన మెడికల్ సీట్లకు అనుగుణంగా ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టంట్ ప్రొఫెసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక కాలేజీ వారిని ఇంకో కాలేజీలో స్టాఫ్ గా చూపిస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో లోలోపల హరాజ్ మెంట జరుగుతుంది. డాక్టర్ కావాలని గొప్ప కలలు కన్న బిడ్డ ప్రీతి, కానీ సీనియర్ స్టూడెంట్ సైఫ్ తనను వేధిస్తున్నాడు అని అధికారులు అందరికీ చెప్పుకుంది. కానీ స్పందించలేదు. తల్లికి కూడా పదే పదె ఫోన్ చేసి చెప్పుకుందని’ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల గుర్తుచేశారు.
మెడికల్ కాలేజీలో పీజీలో ర్యాగింగ్ లేదు అనుకున్నాము. కానీ ప్రీతి ఉదంతం పీజీ చదివే అమ్మాయిల మీద ఎలా హెరాజ్ చేస్తున్నారో తెలుస్తుందన్నారు. ప్రీతిపై ర్యాగింగ్ విషయంలో HOD సకాలంలో స్పందించి పరిష్కారం చేసి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. ప్రీతి తండ్రి పోలీసు కంప్లయింట్ ఇచ్చినా కూడా సరైన సమయంలో స్పందించలేదని, ప్రీతి విషయంలో అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయని ఎమ్మెల్యే ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రీతి సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్న. హాస్పిటల్స్ లో భారమంతా పీజీ విద్యార్థుల మీద పడుతుందన్నారు. సరిపోయేంత స్టాఫ్ లేదని, కానీ ఎవరి మీద భారం పడకుండా చూడాలన్నారు. విద్యార్థులకు ఈ సంఘటన తరువాత రిలీఫ్ వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈటల కోరారు.
ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ప్రీతి ఫోన్ కాల్
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు రోజు ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. ఆ ఫోన్ కాల్‌లో ప్రీతి తాను కాలేజీలో పడుతున్న వ్యధను తన తల్లితో చెప్పుకుంది. తన సీనియర్ అయిన సైఫ్ అనే వ్యక్తి తనతోనే కాకుండా తన తోటివారిని, జూనియర్లను కూడా వేధిస్తున్నాడని తల్లితో వాపోయింది. సీనియర్లు అంతా ఒకటే అని తన తల్లితో చెప్పింది. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా ఫలితం లేకుండా పోయిందని, సైఫ్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని ప్రీతి వాపోయింది. తాను ఒకవేళ సైఫ్ పై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒకటై తనను దూరం పెడతారని భయం వ్యక్తం చేసింది. సైఫ్ తో తాను మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తాను అని తల్లి చెప్పినట్లుగా ఆడియో టేప్‌లో ఉంది.