Telangana : తెలంగాణ అసెంబ్లీలో "పవర్" ఫుల్ ఫైట్- కోట్లు దోచి సత్యహరిశ్చంద్రుల వారసులమని చెప్పుకుంటున్నారు: రేవంత్
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో పవర్‌ఫుల్‌పైట్ హోరాహోరీగా సాగింది. సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ హీటెక్కింది. జగదీష్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
Assembly Budget Session: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై వాడీవేడీ చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ సంస్కరణల పేరుతో అప్పనంగా ప్రభుత్వం సొమ్మును దొచుకున్నారని అటెండర్ ఉద్యోగాన్ని కూడా తమ వాళ్లకే ఇచ్చుకొని విద్యుత్ శాఖనే సర్వనాశనం చేశారని ఆరోపించారు.
ప్రతి ప్రాజెక్టులో బీనామీలతో టెండర్లు పిలిచి వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు రేవంత్. ఇంత చేసినా నిజాయితీపరులు మాదిరిగా మాట్లాడుతున్నారని అన్నారు. సత్యహరిశ్చంద్రుల వారుసలమని చెప్పుకుంటున్న వారు విద్యుత్ కమిషన్ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని అన్నారు. విద్యుత్ సంస్కరణ పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ కోరింది వారేనని... అలాంటి విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు. దీనిపై కోర్టుకు వెళ్లి కూడా ఎదురు దెబ్బతిన్నారని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తాము విచారణాధికారిని కూడా మార్చామన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ వెలుగులకు కేసీఆర్ పాలన కారణం కాదని.. అంత కంటే ముందు సోనియా గాంధీ, జైపాల్‌రెడ్డి చొరవతోనే తెలంగాణ విద్యుత్ కొరత తీరిందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సభ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. అప్పట్లో తాను నిజాలు మాట్లాడితే తనను మార్షల్స్‌తో బయటకు నెట్టేశారని అన్నారు. ఇప్పుడు విద్యుత్ గురించి చెబుతున్న వారంతా రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు.
తెలంగాణకు బీఆర్‌ఎస్ వాళ్లు ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని అదంతా బూటకమన్నారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు, వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ వెలుగు వచ్చాయని గుర్తు చేశారు. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు సంబంధిత ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉందని... కానీ ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారని వివరించారు. రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారని తెలిపారు. 53.46శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి సోనియాగాంధీని ఒప్పించారన్నారు.
జైపాల్ రెడ్డి కృషి, సోనియా చలవతోనే తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారన్నారు రేవంత్. ఆనాడు కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డులు తీయండని సభాపతికి రిక్వస్ట్ పెట్టారు. ఆనాడు తాను సభలో మాట్లాడితే మార్షల్స్‌తో బయటకు పంపించారని వివరించారు. సోలార్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెబుతున్నారని... అవి ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ ఏలుబడిలో సోలార్ పవర్ కేవలం ఒక మెగావాట్ మాత్రమేనని వివరించారు.
పవర్ ప్లాంట్స్‌కు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్, సివిల్ వర్క్ కాంట్రాక్టు విషయంలో బీఆర్‌ఎస్ తెలివి ప్రదర్శించిందన్నారు. గంపగుత్తగా బీహెచ్ఎల్ కాంట్రాక్టు అప్పగించారన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్స్ మొత్తం వీళ్ల బినామీలు, బంధువులు, అనుయాయులకు ఇచ్చారని ఆరోపించారు. అందులో వేలకోట్ల ఫ్రాడ్ జరిగిందని విమర్శించారు. విచారణలో అంతా బయటపడుతుందనే ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు టెండర్ వేస్తే సూపర్ క్రిటికల్ టెండర్ పిలిస్తే కొరియన్, బీహెచ్ఈఎల్, మరో కంపెనీ పాల్గొన్నాయని వివరించారు రేవంత్. అక్కడ 18శాతం లెస్‌కు బీహెచ్ఈఎల్ పనులు దక్కించుకుందని.. ఇక్కడ కూడా 18శాతం లెస్‌కు పనులు చేసే అవకాశం ఉన్నా.. ప్రాజెక్టును నామినేషన్‌పై బీహెచ్ఈఎల్‌కు అప్పగించారన్నారు. అందులో దాదాపు 8వేల కోట్లు కుంభకోణం జరిగిందని తెలిపారు.
భద్రాద్రి పవర్ ప్రాజెక్టు విషయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో గుజరాత్‌లోని ఇండియా బుల్స్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారన్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించాలని చట్టంలో ఉన్నా ఉల్లంఘించారని అన్నారు. ఇండియా బుల్స్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టలేదని... వీళ్ల నిర్వాకంతో 16 మంది అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి దాపురించిందన్నారు.
వారి కోరిక మేరకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశామని దొరికిపోయామని అర్ధమైంది కాబట్టే కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కావాలన్నది వాళ్లే సెగ తగలగానే వద్దన్నది వాళ్లేనంటూ ఎద్దేవా చేశారు. తిన్నింటి వాసాలులేక్కబెట్టే లక్షణాలు తమకు లేవన్నారు రేవంత్ రెడ్డి. ఆ వాదన ఏంటో కమిషన్ ముందు చెప్పాలని సూచించారు. సాయంత్రానికల్లా విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమిస్తామన్నారు.
రూ.81వేల కోట్లు అప్పులకు కారణమైన వాళ్లు ఇప్పుడు నల్లగొండ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే బీఆర్‌ఎస్ సంగతి తేలిపోయిందన్నారు రేవంత్ . పవర్ ప్లాంట్ పేరుతో దోచుకున్నారని అన్నారు.