Hyderabad Traffic: హైదరాబాద్‌లో నేడు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు పూర్తి వివరాలు ఇవీ
లిబర్టీ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను అబిడ్స్ వైపు అనుమతించరు. వాటిని హిమాయత్ నగర్ - నారాయణ గూడ - కాచిగూడ నుంచి కోఠికి మళ్లిస్తారు.
Mass Singing Of National Anthem: సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరగనున్న వేళ హైదరాబాద్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.30 దాకా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రభావంతో మధ్యాహ్నం తర్వాత కూడా ట్రాఫిక్ జామ్ కష్టాలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. లిబర్టీ, బషీర్ బాగ్, జగ్జీవన్ రామ్ జంక్షన్, కింగ్ కోఠి, అబిడ్స్‌లో భారీగా ఆంక్షలు ఉండనున్నాయి. కాబట్టి, ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ ట్రాఫిక్ డైవెర్షన్స్ వల్ల ఇతర రూట్లలోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు, కోఠిలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఐదు వేల మంది విద్యార్థులు జాతీయ గీతాలాపనలో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు అన్ని ట్రాఫిక్ కూడళ్లలో నిమిషం పాటు రెడ్ సిగ్నల్ పడనుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
* లిబర్టీ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను అబిడ్స్ వైపు అనుమతించరు. వాటిని హిమాయత్ నగర్ - నారాయణ గూడ - కాచిగూడ నుంచి కోఠికి మళ్లిస్తారు. కింగ్ కోఠి నుంచి అబిడ్స్ మెయిన్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను కింగ్ కోటి ఎక్స్ రోడ్స్ - హనుమాన్ తెక్డీ - ట్రూప్ బజార్ - కోఠి వైపు మళ్లించనున్నారు.
* పీసీఆర్ నుంచి బాబూ జగ్జీవన్ రామ్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ఆ వైపు వెళ్లనివ్వరు. వీరు ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ మార్గంలో వెళ్లాల్సి ఉంది.
* ఎంజే మార్కెట్, జాంబాగ్ నుంచి అబిడ్స్ వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డుకు మళ్లించనున్నారు. ఈ క్రమంలో సోమాజిగూడ, ఖైరతాబాద్, రవీంద్రభారతి జంక్షన్, అసెంబ్లీ, ఎల్బీ స్టేడియం, బీజేఆర్ స్టాట్యూ, లిబర్టీ, హిమాయత్ నగర్, జీపీఓ అబిడ్స్, ఎంజే మార్కెట్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మరింతగా ట్రాఫిక్ సమస్య ఏర్పడనుంది.
పార్కింగ్ వివరాలు ఇవీ
లిబర్టీ నుంచి అబిడ్స్ జీపీవోలో పాల్గొనేందుకు వచ్చేవారు వాహనాలను నిజాం కాలేజీ స్పోర్ట్స్ గ్రౌండ్ లో పార్క్ చేసే వెసులుబాటు కల్పించారు. అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ నుంచి కింగ్ కోఠి జంక్షన్, బాటా నుంచి బొగ్గుల కుంట జంక్షన్, జీహెచ్ఎంసీ ఆఫీసు, రామక్రిష్ణ థియేటర్ గ్రౌండ్ వద్ద వాహనాలను నిలపవచ్చు. ఎంజే మార్కెట్, ఆఫ్జల్ గంజ్ నుంచి వచ్చేవారు తమ వాహనాలను నాంపల్లి అన్నపూర్ణ హోటల్ రోడ్డు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పార్కింగ్ చేసుకోవచ్చు.
అబిడ్స్‌లో పాల్గొననున్న కేసీఆర్
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన జరగనుంది. ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో సామూహిక గీతాలాపనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాలాపన ప్రారంభమవుతుంది. సీఎం కేసీఆర్ అబిడ్స్ లోని సర్కిల్ లో పాల్గొననున్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నళ్లు పడనున్నాయి. సరిగ్గా 11.30 గంటలకు వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేసి కారు లేదా బైక్ నుంచి కిందికి దిగి అందరూ నిలబడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.