Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ACB raids: ఏపీలో 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఒకే సారి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అనేక ఆఫీసుల్లో అవినీతి దందా వెలుగులోకి వచ్చింది.

Sub Registrar offices Corruption: ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రార్ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై ఏసీబీ యుద్ధం ప్రకటించింది. ACB అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులను పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన అనేక ఫిర్యాదులు, అవినీతి ఆరోపణల కారణంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు.
భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలు, అక్రమ లావాదేవీలు, డాక్యుమెంట్ ఫార్జరీలు వంటి ఫిర్యాదులు గత కొన్ని నెలలుగా పెరిగాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ACB అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 120 కార్యాలయాలపై సోదాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫైళ్లు, ఆర్థిక రికార్డులు, కంప్యూటర్ సిస్టమ్‌లను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది నగదు, డాక్యుమెంట్లు దాచిపెట్టే ప్రయత్నాలు చేశారు.
ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ACB టీమ్ సోదాలు నిర్వహించింది. అధికారులు రావడంతో కొంతమంది సిబ్బంది భయపడి, జేబుల్లో దాచిన నగదును బయటకు విసిరేసినట్లు సమాచారం. మధురవాడ, భోగాపురాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ACB టీమ్‌లు డాక్యుమెంట్లు, కంప్యూటర్ డేటాను స్కాన్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భూమి మోసాలు ఎక్కువగా నమోదవుతున్నాయి, కాబట్టి తనిఖీలు లోతుగా చేస్తున్నారు. సత్యసాయి జిల్లా చిలుమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోదాలు జరిగాయి. ఇటీవల సబ్ రిజిస్ట్రార్‌పై పలు ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. కార్యాలయ తలుపులు మూసివేసి, సిబ్బందిని విచారించి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలోని ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
— Vizag News Man (@VizagNewsman) November 5, 2025
ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు
తలుపులు మూసి వేసి ఫైల్స్ తనిఖీలు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న తనిఖీల్లో భాగంగా విశాఖలోనూ దాడులు.#AndhraPradesh… pic.twitter.com/jl4CL0xZCv
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB డీఎస్పీ బీవీ రావు నేతృత్వంలో సోదాలు జరిగాయి. కోనసీమ , ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 120 చోట్ల ఏసీబీ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ప్రజలు భూమి రిజిస్ట్రేషన్ సంబంధిత ఫిర్యాదులను ACBకు చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
తనిఖీలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రిజిస్ట్రార్ల అవినీతి వల్లే పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని.. భూముల వివాదాలు పెరిగిపోతున్నాయన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. చాలా చోట్ల వ్యవహారాలను మొత్తం ప్రైవేటు వ్యక్తులే చక్క బెడుతున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నింటికీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.





















