Telangana Latest Weather: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఆ గ్రామాలకు రాకపోకలు బంద్!
Telangana Latest Weather: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అడవి బిడ్డలను వణికిస్తున్నాయి. అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెలు తెగిపడుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోతున్నాయి.

Telangana Latest Weather: తెలంగాణవ్యాప్తంగా గత మూడు రోజులుగా దంచికొడుతున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో జనజీవనం స్దంభిస్తుంటే, జిల్లాలో పరిస్దితి మరింత దారుణంగా మారింది. ముఖ్యంగా భారీ వర్షాల ప్రభావం ములుగుజిల్లా, మహబూబాబాద్ జిల్లాలపై కనిపిస్తోంది. ములుగు జిల్లాలోని ఒక్క వెంకటాపురం మండలంలోనే ఏకంగా 30 గంటల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైదంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు.
వెంకటాపురం, యాకన్నగూడెం వద్ద వాగు ఉద్ధృతికి తాత్కాలికంగా రాళ్ల వాగుపై ఏర్పాటు చేసుకున్న రోడ్డు కొట్టుకుపోవడంతో భద్రాచలం , ములుగు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తప్పని సరి పరిస్దితిిలో భద్రాచలం వెళ్లాల్సిన వారిని ఏటూరు నాగారం, మణుగూరు మీదుగా భద్రాచలం పంపుతున్నారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల ప్రభావంతో వెంకటాపురం, మల్లాపురం గ్రామాల మధ్య ఉన్న వంతెన పూర్తిగా మునిగిపోవడంతో మల్లాపురం, రాచపల్లి, కర్రివాగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగు, పాకాల వాగులు ఉప్పొంగుతున్నాయి. కొత్తగూడెం మండలంలోని గాదేవాగు, గుంజేడుతోపు, గూర్కాపల్లి వాగు , కొత్తపల్లి వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆదిలక్ష్మీపురం,తిమ్మాపురం ,ముండ్రాయి గూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గార్ల రాంపూర్ వద్ద మున్నేరు వాగు రోడ్లను ముంచెత్తి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాంపురం, గ్రాండాతి మడుగు, మధ్యవంచ, కొత్త తాండా గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. తెలంగాణవ్యాప్తంగా దంచికొడుతున్న వార్షాల ప్రభావం ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, పాతవరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాల ప్రభావంతో ములుగు జిల్లా మంగపేటలో 30 ఇళ్లు మునిగిపోయాయి. మంగపేట, ఏటూరినాగరం, గోవిందరావుపేట మండలాల్లో 20 సెంటిమీటర్లకు తక్కువ కాకుండా వర్షపాతం నమోదవుతోంది. మంగపేట మండలోని మల్లూరు అత్తచెరువుకు గండిపడటంతో చెరువు పరిసర ప్రాంతాల్లో 40కిపైగా ఇళ్లు మునిగిపోయాయి.
మహబూబాబాద్ జిల్లాలోని మానేరువాగు ఉప్పొంగడంతో ఏకంగా 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాల నుంచి ప్రతీ నిత్యం 6వేల మందికిపైగా మానేరు వాగు మీదుగా ప్రయాణం చేస్తుంటారు. ఇప్పడు ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్దితి ఈ గ్రామాల్లో నెలకొంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇతర జిల్లాల పరిస్థితి కూడా దారుణంగా మారింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోడ్లు చెరువులను తరలిపిస్తున్నాయి. అత్యవసర సమయంలో కూడా అంబులెన్స్‌లు రోడ్లపై నడిపే పరిస్దితిలేదు. నగరంలోని రోడ్లపై నడవాలంటే మునిగేపోయేంతలా ఉంది. రోడ్ల ప్రక్కన ఉన్న ఇళ్లలోని సామాన్లు వరదలో కొట్టుకుపోయాయి.
వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతుండటంతో ఉత్తర ఈశాన్య జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.ఆయా జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రులు ముంపు ప్రాంతాలలో పర్యటించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క, వాగులు పొంగుతున్న ప్రాంతాల‌్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలలో మంత్రులు పర్యటించి పరిస్దితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే గూడురులోని భీమునిపాదం, భయ్యారంలోని జలధార జలపాతం వద్ద పర్యాటకులను ఆకట్టుకునేలా జలపాతం ఉప్పొంగడంతో సందడి వాతావరం నెలకొంది.





















