వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదావేసింది. గురవారం మధ్యాహ్నం 3.30కి విచారిస్తామని న్యాయమూర్తి చెప్పారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పిటిషన్ ఇవాళ అసలు లిస్టే కాలేదు. పదిన్నరకు అవినాష్ కేసు విషయాన్ని ఆయన తరఫున వాదించే న్యాయవాది ప్రస్తావించారు. విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు. జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టబోమని హైకోర్టు తెలిపింది. గురువారం విచారణ చేపట్టాలని అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది రిక్వస్ట్ చేశారు. అదే టైంలో శుక్రవారం వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని సునీత తరఫు న్యాయవాది కోరారు. కోర్టు మాత్రం గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు విచారణ చేపడతామని ప్రకటించింది.
ముందుగా ఈ కేసు విచారణ మంగళవారం ఉదయం ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాష్ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే తుది తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత మధ్యాహ్నం మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు బుధవారం వింటామని న్యాయమూర్తి .. కేసును వాయిదా వేశారు. ఇవాళ ఉదయం మరోసారి విచారణకు వచ్చింది. దీన్ని గురువారానికి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.
గత విచారణలో ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, తాము చెప్పిన విధంగా అవినాష్‌ను విచారించాలని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలాగే అవినాష్ మధ్యంతర బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. దీనిపై సునీతరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అలాగే ముందస్తు బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగాల్సి ఉంది. గురువారం ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ వస్తుంది.
ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు: అవినాష్ రెడ్డి
కడప జిల్లా పులివెందులలో మాట్లాడిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎంపీ స్థాయి వ్యక్తికే నిజాయితీ నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సునీతమ్మ స్టేట్మెంట్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. మొదట సునీతమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ లో మా ప్రస్తావనే లేదన్నారు. మొదట లెటర్ దాచిన విషయంలో కూడా మా కుటుంబానికి సంబంధం లేదు అన్నారు. సీబీఐ దర్యాప్తు కుట్ర కోణంలో ఉందన్నారు. తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సునీతక్క మాట మార్చింది
"ఇప్పుడు సునీతక్క పూర్తిగా మాట మార్చింది. సునీతక్క భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే నేను అక్కడికి వెళ్లాను. ఫోన్ రావడం ఒక 15 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే ఈ రోజు నామీద నిందలు ఉండేవి కావు. నన్ను కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోంది. నాకు నాన్నకు, శంకర్ రెడ్డి అన్నకు ఎలాంటి సంబంధం లేదు. వివేకాను హత్య చేయబోయే ముందు దస్తగిరి వాళ్లు రాయించిన లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆనాడే వాళ్లు చంపి డ్రైవర్ ప్రసాద్ ను ఇరికించాలని చూశారు. ఈ రోజు అటువంటి కుట్రే నా మీద జరుగుతుంది. నేను ఏ పాపం చేయలేదు కాబట్టి గత మూడు సంవత్సరాలుగా సీబీఐ విచారణ గురించి పట్టించుకోలేదు. మీడియా ఈ కేసులోని వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రేపు ఎల్లుండి కూడా పులివెందుల లో ఉంటా. " - ఎంపీ అవినాష్ రెడ్డి
సీబీఐ మిమ్మల్ని అరెస్టు చేస్తుందా అని ఓ విలేకరి ప్రశ్నించగా అంతా దైవాదీనం అని ఎంపీ అవినాష్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
ధర్మో రక్షతి రక్షితః ధర్మమే నన్ను కాపాడుతుందన్నారు. నేను ఎంత మంచివాడినో జిల్లా ప్రజలకు తెలుసన్నారు.