HCA News: హైదరాబాద్ క్రికెట్ సంఘంలో ప్రక్షాళన - 57 క్లబ్బులపై వేటు
HCA News: సుప్రీంకోర్టు వేసిన కమిటీ హైదరాబాద్ క్రికెట్ సంఘంలో ప్రక్షాళన చేపట్టింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్న 57 క్లబ్బులపై వేటు వేశారు.
HCA News: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి హెడ్‌లైన్‌లోకి వచ్చింది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న సంఘం ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే ఈ హెచ్‌సీఏ పూర్తిగా చక్కదిద్దే పనిలో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నిమగ్నమై ఉంది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన చేపట్టింది. వివిధ క్లబ్బులతో హెచ్సీఏను శాసిస్తున్న క్రికెట్ పెద్దలకు జస్టిస్ లావు నాగేశ్వరారవు షాక్ ఇచ్చారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్న 57 క్లబ్బులపై జస్టిస్ నాగేశ్వరరావు వేటు వేశారు. హెచ్సీఏ ఎన్నికల్లో ఒక దఫా లేదా మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయా క్లబ్బులు, వాటి ఎగ్జిక్యూటివ్ కమిటీలపై నిషేధం విధించారు.
ఇలా నిర్ణయం తీసుకుంటు సోమవారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్సీఏ ఎపెక్స్ కమిటీకి నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జస్టిస్ నాగేశ్వర రావు కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. హెచ్సీఏను గాడిన పెట్టే బాధ్యతను స్వీకరించిన జస్టిస్ నాగేశ్వర రావు.. అంతకు ముందు సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకున్నారు.
80 క్లబ్బులను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది
80 క్లబ్బులను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది, వారి కుటుంబ సభ్యులు హెచ్సీఏ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నట్లు పర్యవేక్షక కమిటీ గుర్తించింది. జీహెచ్ఎంసీకి చెందిన 21 క్లబ్బులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు పేర్కొంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ నాగేశ్వర రావు.. ఆయా క్లబ్బుల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధుల నుంచి వివరణ తీసుకున్నారు. కొందరు వ్యక్తులు బహుళ క్లబ్బులు కల్గి ఉండటాన్ని గుర్తించిన జస్టిస్ నాగేశ్వర రావు వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. విరుద్ధ ప్రయోజనాలు కల్గి ఉన్న 57 క్లబ్బులపై అనర్హత వేటు వేశారు. ఆ క్లబ్బులు, వాటి ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో ఉన్న వాళ్లు ఒక దఫా లేదా మూడేళ్ల పాటు హెచ్సీఏ ఎన్నికలకు దూరం అయినట్లు ప్రకటించారు. ఈ క్లబ్బులు రానున్న ఎన్నికల్లో పాల్గొనకుండా, ఓటు హక్కు వినియోగించకుండా నిషేదం విధించారు. దీంతో హెచ్సీఏ అధ్యక్ష, కార్యదర్శితో సహా అత్యున్నత పదవులపై ఆశలు పెట్టుకున్న చాలా మంది రాబోయే ఎన్నికలకు దూరం అయ్యారు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 215 క్లబ్బులు
శేష్ నారాయణ, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, ప్రకాష్ చంద్ జైన్, అర్షద్ అయూబ్, వంకా ప్రతాప్, విక్రమ్ మాన్ సింగ్, స్వరూప్, విజయానంద్, జాన్ మనోజ్ సహా కీలక వ్యక్తులపై వేటు పడంది. జస్టిస్ నాగేశ్వరరావు ఉత్తర్వుల నేపథ్యంలో రానున్న హెచ్సీఏ ఎన్నికల్లో 158 మొత్తంగా 215 క్లబ్బులు ఓటు హక్కు వినియోగించుకోనున్నాయి. ఇక తమ క్లబ్బులు ఉన్న జీహెచ్ఎంసీ వాదనను జస్టిస్ నాగేశ్వర రావు తోసిపుచ్చారు. క్లబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో జీహెచ్ఎంసీ విఫలం అయింది. జీహెచ్ఎంసీ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చిన జస్టిస్ నాగేశ్వరరావు.. ఆ క్లబ్బుల ప్రతినిధులకు యాజమాన్య హక్కులు ప్రసాదించారు.