Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలో అలసత్వం వహించడంతో పాటు పీఆర్సీ డీఏ విషయంలో సీపీఎస్ విషయంలో, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

హైదరాబాద్: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని ఈ ఎగుమతులకు అడ్వైజర్‌గా నియమించుకోవడంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేస్తామని గొప్పగా ఎంవోయూ (MoU) చేసుకున్న ప్రభుత్వం, కేవలం 22,750 టన్నుల వద్దే ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో వాటాలు తేలకపోవడం వల్లే ఎగుమతులు నిలిచిపోయాయని ఆయన విమర్శించారు.
కాకినాడ పోర్టులో ముక్కిపోయిన బియ్యం
సుమారు ఏడాది కాలంగా 7,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టులోనే ఉండిపోయాయని, అవి పురుగులు పట్టి ముక్కిపోతున్నాయని హరీశ్ రావు సభ దృష్టికి తెచ్చారు. ఇంతటి నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. సివిల్ సప్లై శాఖలో జరిగిన ఈ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ, ఆధారాలతో సహా అన్ని నిరూపిస్తామని సవాల్ విసిరారు. భవిష్యత్తులో తాము అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ఈ కుంభకోణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
రైతులకు బోనస్ పై ప్రశ్నలు
యాసంగి వరి పంటకు సంబంధించి రైతులకు ప్రకటించిన బోనస్ ఎప్పటిలోపు చెల్లిస్తారో మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తోందని ఆరోపిస్తూ, నిరసనగా సభలోనే బైఠాయించారు. రైతుల ప్రయోజనాల కంటే అడ్వైజర్ల సలహాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన విమర్శించారు.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌పై బీఆర్ఎస్ నిరసన
రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మోసపూరిత వైఖరి చూపుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలో అలసత్వం వహించడం, పీఆర్సీ డీఏ విషయంలో సీపీఎస్ విషయంలో, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.
ఆర్టీసీ కార్మికుల హామీలపై అసెంబ్లీలో హరీశ్ రావు ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మహిళల ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం) వల్ల రూ. 9,200 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ లాభాల్లో ఉందో లేక నష్టాల్లో ఉందో మంత్రి సమాధానం చెప్పాలని కోరారు.
బకాయిలు, పీఆర్సీ అమలు
ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్, ఏరియర్స్, సీసీఎస్ బకాయిలను ప్రభుత్వం ఎందుకు ఆపుతోందని హరీశ్ రావు ప్రశ్నించారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొత్త పీఆర్సీని (PRC) ఎప్పటి నుండి అమలు చేస్తారో తేదీని ప్రకటించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ ప్రభుత్వం వారిని ఏ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తుందో తేల్చాలన్నారు.
యూనియన్ల పునరుద్ధరణ, బస్సుల కొరత
కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఆర్టీసీ యూనియన్లను ఎప్పుడు పునరుద్ధరిస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా సిద్దిపేట వంటి డిపోల్లో బస్సుల సంఖ్య దారుణంగా తగ్గిపోయిందని, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఎప్పుడు వస్తాయని నిలదీశారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కేటాయించాలని, దాటవేత ధోరణి వీడి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















