Governor Tamilisai: కు.ని. ఆపరేషన్ మరణాలు అందుకే జరిగాయి: గవర్నర్, అధికారులకు తమిళిసై వార్నింగ్
గవర్నర్ తమిళిసై ఆదివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
Governor Tamilisai: హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో బాధితులను గవర్నర్ తమిళిసై పరామర్శించారు. అందుకోసం ఆమె ఆదివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. బాధితులకు వైద్యం పరంగా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ.. నిమ్స్‌లో ట్రీట్‌మెంట్‌పై బాధితులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. కుటుంబ నియత్రణ ఆపరేషన్లు విఫలం అయి నలుగురు మృతి చెందడం మామూలు విషయం కాదని గవర్నర్ తమిళిసై అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక అసలు కారణాలు తెలుస్తాయని తెలిపారు.
ఆపరేషన్ల టార్గెట్, ఇన్ఫెక్షన్ వల్లే మరణాలు - గవర్నర్
ఇలాంటి ఘటనలు మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని హెచ్చరించారు. త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలనే లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకోకూడదని అన్నారు. ఇన్ఫెక్షన్ల వల్ల మృతి చెందారని భావిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు.
అంతకుముందు, గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 50 సార్ల కంటే ఎక్కువ సార్లు రక్త దానం చేసిన వారికి ‘చిరు భద్రత’ పేరుతో గవర్నర్ చేతుల మీదుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. బ్లడ్ బ్యాంకు ద్వారా సేవ చేస్తున్న చిరంజీవికి అభినందనలు తెలిపారు. రక్తదానం చేయడం చిన్నవిషయం కాదని అన్నారు. తాను హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలో రక్తం ఇచ్చేందుకు సొంత కుటుంబ సభ్యులు కూడా వెనకడుగు వేసేవారని గుర్తు చేసుకున్నారు.
రక్తదానం చేసిన వారిలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుందని అన్నారు. తెలంగాణ రాజ్‌భవన్ తరఫున కూడా వివిధ సందర్భాల్లో రక్తదాన శిబిరాలు చేపడుతున్నామని అన్నారు. అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్‌ను రూపొందించామని కూడా తెలిపారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందులో భాగం కావాలని తమిళిసై సౌందరరాజన్ చిరంజీవిని కోరారు.
ప్రస్తుతం చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 70 శాతం రక్తం పేదలకు ఉచితంగా అందించామని, మిగతా రక్తాన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అందించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య తక్కువగా ఉందని అన్నారు. ఇప్పటిదాకా తాము 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని తెలిపారు. రక్తదానం చేస్తున్నవారికి ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
గతంలో కరోనా సమయంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ప్రారంభించినప్పుడు, సినీ కార్మికులకు, అవసరార్థులకు ఫ్రీగా నిత్యావసరాలు అందించినప్పుడు గవర్నర్ తనను ఎంతో ప్రోత్సహించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలో తాను ఆక్సీజన్ బ్యాంకు స్థాపించి వివిధ ప్రాంతాలకు ఆక్సీజన్ సరఫరా చేయడంలోనూ స్పందించిన తొలి వ్యక్తి గవర్నర్ అని చిరంజీవి కొనియాడారు. ఆ సమయంలో గవర్నర్ ఎన్నో సార్లు ట్వీట్ చేసి, తన మద్దతును చాటుకున్నారని తెలిపారు.