Hyderabad News: నెహ్రూ జూలో 125 ఏళ్ల వయసున్న భారీ తాబేలు మృతి! సమస్య ఏంటంటే
Nehru Zoological Park Hyderabad: ఈ తాబేలు వయసు 125 ఏళ్లు కావడం వల్ల.. దీన్ని పురాతన జీవుల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.
Galapagos Giant Tortoise Death in Hyderabad Zoo: హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో ఓ అరుదైన భారీ తాబేలు చనిపోయిందని జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ఒక మగ తాబేలు అని.. దీని వయసు 125 సంవత్సరాలు అని తెలిపారు. గాలాపాగోస్ జెయింట్ తాబేలుగా పిలిచే ఇది.. వయసు పైబడడం వల్ల తలెత్తే సమస్యల కారణంగా ఆదివారం (మార్చి 17) తెల్లవారుజామున మరణించిందని తెలిపారు. ఆ తాబేలు గత 10 రోజుల నుండి ఆహారం కూడా తీసుకోవడం లేదని చెప్పారు. హైదరాబాద్ నెహ్రూ జువలాజికల్ పార్క్ డిప్యూటీ డైరెక్టర్ (వెట్) డాక్టర్ ఎంఏ హకీమ్ నేతృత్వంలోని జూ వెటర్నరీ బృందం ఆ భారీ తాబేలుకు గత 10 రోజుల నుండి చికిత్స అందించింది. అయినా ఫలితం లేదు.
ఈ తాబేలు వయసు 125 ఏళ్లు కావడం వల్ల.. దీన్ని పురాతన జీవుల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. జూ ప్రారంభమైనప్పటి నుండి ఆ తాబేలు తన తోటి తాబేలుతో కలిసి జీవిస్తోంది. ఆ మరో తాబేలు వయసు ఇప్పుడు 95 సంవత్సరాలు. ఈ రెండు భారీ తాబేళ్లు నెహ్రూ జూ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవని జూ అధికారులు తెలిపారు.
ఈ తాబేలు పబ్లిక్ గార్డెన్స్ (బాగ్-ఇ-ఆమ్) నుంచి 1963 సంవత్సరంలో జూకు మార్చారు. అప్పటి నుండి ఇది నెహ్రూ జూపార్క్, హైదరాబాద్‌లోనే ఉంది. జూ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏ హకీం, రాజేంద్రనగర్ వెటర్నరీ సైన్స్ కాలేజీలో పాథాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ డి.మాధురి, అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. స్వాతి, వెటర్నరీ బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వై.లక్ష్మణ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.శంభులింగం, నెహ్రూ జూపార్క్ అసిస్టెంట్ డైరెక్టర్ (వెటర్నరీ) కేవై సుభాష్ తదితరులు ఈ చనిపోయిన తాబేలుకు పోస్టుమార్టం నిర్వహించారు. గాలాపాగోస్ జెయింట్ తాబేలు మృతి పట్ల క్యూరేటర్, జూ సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో తాబేలు అవయవాలు వైఫల్యం చెందడం వల్ల చనిపోయిందని తేలింది. తదుపరి పరిశోధనల కోసం నమూనాలను వెటర్నరీ బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలకు పంపారు.
గాలపాగోస్ జెయింట్ తాబేలు చెలోనోయిడిస్ జాతికి చెందిన చాలా పెద్ద తాబేలు. జాతులు 15 ఉపజాతులను కలిగి ఉంటాయి. ఇది అతిపెద్ద జీవజాతి తాబేలు. ఈ రకం తాబేళ్లు 417 కిలోల వరకు బరువు పెరుగుతాయి.