Viral News: అంత్యక్రియలకు అడ్డొచ్చిన వరద, తాడు సాయంతో ప్రాణాలకు తెగించి పూర్తి చేసిన ప్రజలు
Viral News: తెలంగాణలో ఉప్పొంగుతున్న వాగుల ప్రభావంతో జన జీవనం స్ధంభించింది. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే కనీసం అంత్యక్రియలు చేయలేని దుస్దితి నెలకొంది.
Viral News: గత రెండు రోజులుగా తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. మెదక్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు, వరద ప్రభావంతో అనేక గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. ఇళ్లు దాటి బయట కాలు పెడితే ఎక్కడ వరద ముంపు మింగేస్తుందనే భయం సర్వత్రా వెంటాడుతోంది. తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన ఓ హృదయ విధారక ఘటన కలచివేస్తోంది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లిలో అనారోగ్యంతో హరికృష్ణ (22) అనే యువకుడు మృతి చెందాడు. కొడుకు చావుతో కోలుకోలేని దుఖంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతుంటే, మరోవైపు వరద కష్టాలతో కనీసం చివరి మజిలీ ఎలా చేయాలో అర్దం కాని దుస్దితి నెలకొంది.
మర్పల్లి గ్రామానికి చుట్టూ వరద నీరు ఉప్పొంగుతోంది. ముఖ్యంగా గ్రామం నుంచి శ్మశానానికి వెళ్లే మార్గంలో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. జోరు వర్షం ఓ పక్క, కాలు తీసి కాలు బయటపెట్టలేని పరిస్దితిలో వరద తీవ్రత మరో పక్క..దీంతో తమ బిడ్డ అంత్యక్రియలు చేసే దారిలేక కుటుంబ సభ్యుల్లో దిక్కుతోచని పరిస్దితి నెలకొంది. గ్రామస్దులు జోక్యం చేసుకుని , అంతాకలసి హరికృష్ణ అంత్యక్రియలకు పెద్ద సాహసమే చేశారు. జేసిబి సహాయంతో ట్రాక్టర్ పై మృతదేహాన్ని అతి కష్టం మీద వాగు దాటించే సాహసం చేశారు. వాగుకు ఇరువైపులా చెట్లకు తాళ్లు కట్టి, తాళ్ల సహాయంతో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఒకరి చేయి మరొకరు పట్టుకుని నెమ్మదిగా శవాన్ని వాగుదాటించారు. అతి కష్టం మీద జోరువానలో సైతం , అత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు ,గ్రామస్దులు పడ్డ కష్టం కలచివేస్తోంది. వాగు ప్రవాహం దాటుకుంటూ గ్రామస్దులు చేసిన సాహసం సోషల్ మీడిాయాలో ట్రెండింగ్ అవుతోంది.





















