Harish Rao: కాళేశ్వరం బ్యారేజీలపై 6 కేబినెట్ భేటీలు, 3 సార్లు అసెంబ్లీలో ఆమోదం: మాజీ మంత్రి హరీశ్ రావు
AP Telangana Water Dispute | బేసిన్లు తెలియని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, బేసిక్స్ తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ( PC Ghosh Commission)కు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అదనపు సమాచారం అందించారు. బేసిన్ల గురించి తెల్వని వ్యక్తి సీఎం అయ్యిండు, బేసిక్స్ తెల్వని ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అయ్యిండు అని హరీష్ రావు సెటైర్లు వేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆరు కేబినెట్ సమావేశాలలో నిర్ణయాలు తీసుకోగా, 6 పర్యాయాలు కాబినెట్ లో ఆమోదం పొందగా, చివరగా అసెంబ్లీలో 3 సార్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందామని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని సాధించారు, కానీ కాంగ్రెస్ నేతల వల్ల అన్యాయం జరుగుతోందన్నారు.
కమిషన్ కు కలిసి సమాచారం ఇచ్చిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంతో మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను దృష్టిలో పెట్టుకొని మా వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్ కు ఇచ్చాం. డాక్యుమెంట్స్ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉంటాయి. సమాచారం కోసం చీఫ్ సెక్రెటరీ, జీఏడీ సెక్రెటరీ, ఇరిగేషన్ సెక్రెట్రరీకి లేఖ రాశాను. ఆ రోజుల్లో తాము తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ నోట్ సమాచారం కావాలని లేఖ ద్వారా అడిగినా, వారి నుంచి స్పందన రావడం లేదు
కేబినెట్ నిర్ణయాలు, అసెంబ్లీలోనూ ఆమోదం..
మాతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని నోట్ రూపంలో ఇచ్చాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి. క్యాబినెట్ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు కమీషన్ కు అందించాం. మూడు సార్లు శాసన సభ ఆమోదం పొందింది. కేబినెట్ భేటీలు, శాసనసభలో ఆమోదం వివరాలను తేదీలతో సహా అందించాం. సందర్భం వచ్చినప్పుడు పూర్తి వివరాలు బయట పెడతాం. కానీ ప్రభుత్వం మాకు అడిగినా ఇవ్వడం లేదు. కమిషన్ ను తప్పుదోవ పట్టించేలా వివరాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం ఉంది.
అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్...
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, 50 ఏండ్ల కాంగ్రెస్ ద్రోహ చరిత్రకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్. అమరవీరులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్
తెలంగాణను ఆంధ్రతో కలిపింది. మా నీళ్లు వదిలిపెట్టి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్. 299: 512 శాశ్వత ఒప్పందం చేసుకున్నారని అబద్దం చెప్పడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డికి తాత్కాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి తేడా తెల్వకుండా మాట్లాడుతున్నాడు. నీటి వినియోగం కేఆర్ఎంబీ చేస్తే, నీటి పంపకం ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం ఏడాదికి మాత్రమే పరిమితం కాగా, నీటి పంపకం శాశ్వతం’ అని హరీష్ రావు తెలిపారు.
కృష్ణా నీటిలో అన్యాయాన్ని దాచిపెడుతున్న రేవంత్
హరీష్ రావు ఇంకా మాట్లాడుతూ.. ‘ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ పాలకులు చేతగాని తనం వల్ల 299 టీఎంసీలు మనకు కేటాయించారు. కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టిన విషయం శాసన సభ రికార్డుల్లో కూడా ఉంది. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి ఇచ్చిన నివేదికలోనూ గోదావరిలో 968 టీఎంసీలు, కృష్ణాలో 299 టిఎంసీలు కేటాయించినట్లు తెలిపారు. గోదావరిలో 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డి, కృష్ణాలో 299 ఇచ్చిన అన్యాయాన్ని ఎందుకు దాచి పెడుతున్నావు. శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే, సెక్షన్ 3 కోసం ఎందుకు అడుగుతారు.
రాష్ట్రం ఏర్పడిన 42వ రోజునే ఢిల్లీలో సెక్షన్ 3 కింద నీళ్ళు పంపిణీ చేయండి, 299 ఇచ్చి అన్యాయం చేసారని, 68శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటా ఇవ్వాలని కేసీఆర్ అడిగారు. సెక్షన్ 3 కోసం కేసీఆర్ నాడు ఉమా భారతిని, గడ్కరి, షేకావత్, ప్రధాని మోదీని కలిసారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించింది కేసీఆర్.
ఈరోజు మనకు 763 టీఎంసీల కోసం న్యాయవాదులు, ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయ్యింది. 299 టీఎంసీలు చాలని 2025లో ఉత్తం, రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టుకొని వచ్చారు. మీరెందుకు సంతకాలు పెట్టారు? కొద్ది నెలల్లో కృష్ణాలో మంచి వాటా రాబోతున్నది.
గోదావరిలో 1000, కృష్ణలో 500 ఇచ్చి ఎన్ని నీళ్లన్నా తీసుకుపో అని చంద్రబాబుకు రేవంత్ ఆఫర్ ఇవ్వడం అజ్ఞానం కాదా. గోదావరిలో మన వాటా 1000 కాదు, 2918 టీఎంసీలు కావాలని కేసీఆర్ అడిగారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కూడా అజ్ఞానిలా మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నీటి హక్కుల గురించి తెలవకపోవడం బాధాకరం. కృష్ణా జలాల్లో 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తుంటే, ఉత్తమ్ మొన్న 573 టీఎంసీలు చాలని అన్నడు. గోదావరి, కృష్ణలో 1000, 500 టీఎంసీలు చాలు అనడం అజ్ఞానంతో మాట్లాడిన మాటలు.
శతాబ్దాల కిందట ఆయకట్టును కలుపుకుంటున్న కాంగ్రెస్
రేవంత్ రెడ్డికి అతి తెలివి మాటలు మాట్లాడుతున్నడు. ఉమ్మడి ఏపీలో 54లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అన్నడు. రేవంత్ రెడ్డి ముత్తాత పుట్టక ముందు ఉన్న ఆయకట్టును కూడా కాంగ్రెస్ లో కలుపుకున్నడు. కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా కాంగ్రెస్ చేసిందా. నిజాంలు కట్టిన ప్రాజెక్టులు కూడా అందులో కలుపుకున్నడు. 1956 ముందు తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ప్రాజెక్టులు గోదావరి, కృష్ణా మీద ఉన్నయి. 16లక్షల ఎకరాలు ఏపీ ఏర్పాటుకు ముందే నీటి పారుదల సౌకర్యం ఉంది. ఇది కూడా కలుపుకొని 54లక్షలకు ఇచ్చినా అంటడు.
1956లో రాష్ట్ర బడ్జెట్ 19 కోట్లు, ఆనాటి వంద రూపాయలు ఈనాటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి రూపాయి నేడు 104 రూపాయలకు సమాధానం. బిఆర్ఎస్ హయాంలో 17లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, 31లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసాం. మొత్తం 48లక్షల ఎకరాలకు సాధించాం. పదేండ్లు కాంగ్రెస్ పాలించింది, ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త, స్థీరీకరణ కలిపి ఆరు లక్షల ఎకరాలు అయితే, బీఆర్ఎస్ ఇచ్చింది 48 లక్షల ఎకరాలు.






















