Kavitha Visits Gajularamaram: దమ్ముంటే అరికెపూడి గాంధీ కబ్జా భూమిని స్వాధీనం చేసుకోండి: ప్రభుత్వానికి కవిత ఛాలెంజ్
HYDRA demolitions in Gajularamaram | మాల్కాజిగిరి జిల్లాలోని గాజులరామారంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలను మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యతిరేకించారు. దమ్ముంటే పెద్దవాళ్ల కబ్జాలను కూల్చివేయాలన్నారు.

గాజుల రామారం: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గాజుల రామారం, బాలయ్యబస్తీ, గాలీపోచమ్మ బస్తీలలో ఉన్న సర్వే నంబర్లు 307, 329/1, 342 పరిధిలో హైడ్రా కూల్చివేతలను మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి పెద్దవాళ్లు చేసిన కబ్జాలు, ఆక్రమణలు కనపడవా.. పేదల ఇండ్ల మీదకు వచ్చి కూల్చడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి దమ్ముంటే కనుక బడాబాబులు చేసిన కబ్జాలు, అక్రమ నిర్మాణాలను ముందుగా కూల్చాలని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు హైడ్రా సిబ్బంది అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. కూల్చివేతలతో నివాసాలు, తమ షెడ్లు కోల్పోయి బాధపడుతున్న వారిని మాజీ ఎమ్మెల్సీ కవిత సోమవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
గాజుల రామారం బస్తీలో పేదల ఇళ్లను కూల్చివేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కవిత విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. పండగ పూటలోనూ ఈ ప్రభుత్వం పేదల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. పేద ప్రజలపై ఇలాంటి చర్యలు సరికాదన్నారు. అమాయక ప్రజల ఇండ్లను కూల్చి, వారి రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన:
కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా, శనివారం, ఆదివారం వంటి వారాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు జరపడాన్ని కూడా కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా తమ ఇష్టరీతిన పేదల ఇళ్ళను కూల్చుతోందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అరికెపూడి గాంధీ భూమి స్వాధీనం చేసుకోండి
ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని కవిత సవాల్ విసిరారు. ముందస్తు సూచనలు, నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు. పేదలను, చిన్న పిల్లలను కూడా బయటకు పంపి వారి ఇళ్ళను కూల్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఇండ్లు కట్టించి ఇచ్చిన తరువాతే ఈ నిర్మాణాలను కూల్చాలని కవిత డిమాండ్ చేశారు. వారికి వసతి ఏర్పాట్లు చేయకుండా అక్రమ నిర్మాణాలు తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు కట్టించి ఇస్తామంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చాక మాత్రమే, వారి షెడ్లు, నిర్మాణాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. లేదంటే, పేదల పక్షాన నిలిచి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత హెచ్చరించారు.
15000 కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుంటాం: హైడ్రా కమిషనర్
గాజులరామారం పరిధిలో 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా.. గత కొన్నేళ్లలో 100కు పైగా ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. కొందరు నేతలు, అధికారులు ఆ భూములను కబ్జా చేసి ప్లాట్లు చేసి విక్రయించారని, కొందరు ఫ్లాట్లు కొట్టి విక్రయించి సొమ్ము చేసుకున్నారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆ భూముల విలువ ఎకరం రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు పలుకుందన్నారు. వాటి విలువ రూ.15000 కోట్లు కాగా, అందులో రూ.5000 కోట్ల విలువైన భూమి కబ్జా అయిందని, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ ఆదివారం మీడియాకు తెలిపారు.






















