Vikarabad- Krishna Railway Line: కొడంగల్ మీదుగా రైల్వే లైను సర్వే పూర్తి, డీపీఆర్ పై అధికారుల కసరత్తు- తగ్గనున్న గోవా దూరం
Kodangal Railway Station | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మీదుగా రైలుమార్గం అయిన కృష్ణా, వికారాబాద్ రైల్వే లైను ఫైనల్ లోకేషన్ తుది సర్వే పూర్తి అయింది.

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మీదుగా రైలు మార్గానికి సంబంధించి సర్వే పూర్తి అయింది. నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వే స్టేషన్ నుంచి వికారాబాద్ వరకు కొత్త రైలు మార్గంలో భాగంగా ఫైనల్ లోకేషన్ తుది సర్వే పూర్తయింది. దాంతో భూసేకరణ, ఆర్థిక, సాంకేతిక విషయాలపై అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) రూపొందిస్తున్నారు. జులై నెలాఖరులోగా రైల్వే బోర్డు కు డి పి ఆర్ చేరనుందని తెలుస్తోంది.
ప్రాజెక్టు సమగ్ర వివరాలు
కృష్ణా-వికారాబాద్ ప్రాజెక్టు దూరం 122 కిలోమీటర్లు కాగా, సుమారు రూ.2,000 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదన ఉంది. కృష్ణా, మక్తల్, నారాయణపేట, దామరగిద్ద, బాలంపేట, దౌల్తాబాద్, కొడంగల్, పరిగి, వికారాబాద్ స్టేషన్లు ఈ మార్గంలో రానున్నాయి. ఈ రైల్వే లైనుకు అయ్యే ఖర్చును 100% కేంద్రమే భరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు జనవరి 31న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కృష్ణా- వికారాబాద్ కొత్త రైల్వే లైన్ కోసం ఎప్పటినుంచో ఆ ప్రాంత ప్రజల నుంచి డిమాండ్ ఉంది. రైల్వే కనెక్టివిటీ తక్కువగా ఉన్న వికారాబాద్, నారాయణపేట జిల్లాలో పలు ప్రాంతాలు ఈ రైలు మార్గంతో అభివృద్ధి చెందనున్నాయని నేతలు భావిస్తున్నారు.
ఏదైనా రైల్వే ప్రాజెక్టు చేపట్టే సమయంలో రేట్ ఆఫ్ రిటర్న్ (ROR) 10 శాతం ఉంటే రైల్వే శాఖ వాటికి గ్రీన్ సిగ్నల్ సులభంగా ఇచ్చేస్తుంది. కానీ కృష్ణా- వికారాబాద్ రైల్వే లైన్లో అటవీ భూములు, సాంకేతిక ఆర్థిక అంశాలు విశ్లేషించిన అధికారులు ఆర్ఓఆర్ ఐదు శాతం వరకే వస్తుందని అంచనా వేసినట్లు సమాచారం. ప్రాథమిక సర్వేలో చేసిన అలైన్మెంట్లో కొద్దిగా మార్పులు చేసి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్ ప్రజలకు దగ్గరగా ఉండేలా ఎలైన్‌మెంట్లో స్వల్ప మార్పులు చేశారు.
గోవా, హుబ్లిలకు తగ్గనున్న దూరం
కృష్ణా, వికారాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ పూర్తయితే కర్ణాటకలోని హుబ్లితో పాటు గోవాలోని మడ్‌గావ్‌కు 35 నుంచి 40 కిలోమీటర్లు దూరం తగ్గనుంది. గుంతకల్ మార్గంలో ట్రాక్ రద్దీ సమస్య సైతం తీరనుంది. హైదరాబాద్ నుంచి గోవాలోని మడ్‌గావ్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే రైళ్లు జడ్చర్ల రైల్వేస్టేషన్ మీద నుంచి గద్వాల, కర్నూలు, డోన్, గుంతకల్, బళ్లారి, హుబ్లి మీదుగా వెళుతున్నాయి. తెలంగాణలో బార్డర్ ఏరియా కావడంతో కృష్ణా మండలం ప్రాంతంలోని కృష్ణా నది దాటితే కర్ణాటక రాష్ట్రం మొదలవుతుంది. కృష్ణా జంక్షన్‌కు రాయచూరు 25 కిమీ దూరంలో ఉంటుంది. హుబ్లి, తాండూరు సిమెంటు ఫ్యాక్టరీల నుంచి సిమెంట్ సరఫరాకు కష్టాలు తొలగనున్నాయి.






















