TS New Secretariat: కొత్త సచివాలయం బేస్మెంట్ కోసం ఒక గని మొత్తం తరలింపు! ఇంకెన్నో మీకు తెలియని విషయాలు
నాలుగు తలుపుల మహాద్వారం సచివాలయ భూగర్భంలో రిజర్వాయర్
సచివాలయ నిర్మాణాల్లో మరో ప్రత్యేకత ధోల్ పూర్ రెడ్ స్టోన్! సెక్రటేరియట్ బేస్మెంట్ కోసం మొత్తం ఎర్రరాతినే వాడారు. దాన్నే పార్లమెంటు భవనానికి వినియోగించారు. ధోల్ పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3,500 క్యూ.మీ. పరిమాణంలో వాడారు. ఇందుకోసం రాజస్థాన్ ఏకంగా ఓ గని మొత్తాన్ని వినియోగించారు. అక్కడి నుంచి వేయి లారీల్లో రాయిని హైదరాబాదుకు తరలించారు. బేస్మెంట్ మొత్తానికి ఎర్రరాయిని వాడగా, ప్రధాన గుమ్మటం నుంచి పోర్టికో వరకు లేత గోధుమ రంగు స్టోన్ వాడారు. స్తంభాలు ఇతర భాగాల్లో ప్రత్యేక నగిషీ ఆకృతుల కోసం గాల్వనైజ్డ్ రీ ఇన్ ఫోర్స్ డ్ కాంక్రీట్ పద్ధతిలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ డెకొరేషన్ చేయించారు. తద్వారా దేశంలో ఈ స్థాయిలో జీఆర్సీ చేసిన తొలి భవనంగా సచివాలయం నిలిచింది. ప్రధాన పోర్టికో ఎత్తు 42 అడుగులు. అంత ఎత్తుతో భారీ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భవనంలో ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తుతో నిర్మించారు. భవనంలో మొత్తం 24 లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కై లాంజ్ వరకు వెళ్లేందుకు రెండు వైపులా 4 లిఫ్టుల చొప్పున 8 లిఫ్టులున్నాయి.
ఇతర నిర్మాణ ప్రత్యేకతల ఇవే:
నాలుగు తలుపుల మహాద్వారం
29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో బాహుబలి మహాద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాదు అడవుల్లోని టేకు కలపతో నాగపూర్ లో ఈ మహాద్వారాన్ని తయారు చేశారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో తలుపులన్నింటినీ టేకుతోనే తయారుచేశారు.
బాహుబలి డోమ్స్
సచివాలయ భవనంపై నాలుగు రకాలైన 34 డోమ్స్ ఏర్పాటు చేశారు. ఈ డోమ్‌లను A B C Dలుగా వర్గీకరించారు. A టైప్ డోమ్ 23.6 ఫీట్లు, B తరహా డోమ్‌లు 31 ఫీట్లు, C టైప్ 21.6 ఫీట్లు, D కేటగిరీ డోమ్‌లు అన్నిటికంటే పెద్దవి -54.8 ఫీట్లు ఉంటాయి. ఈ డోమ్‌ల నిర్మాణానికి 90 టన్నుల వరకు ఐరన్ వినియోగించారని అంచనా. తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్ వంటి కట్టడాల్లో భారీ డోమ్స్ (గుమ్మటాలు) నిర్మించినట్టుగా రాష్ట్ర సచివాలయంలో రెండు భారీ డోమ్స్ నిర్మించారు. 34 గుమ్మటాలు, జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మలు కొత్త సచివాలయానికి మకుటాల్లా నిలిచాయి. 165 అడుగుల ఎత్తున ప్రధాన గుమ్మటాన్ని నిర్మించారు. సచివాలయానికి ముందు, వెనుక ప్రధాన గుమ్మటాలను నిర్మించారు. ఆధునిక నిర్మాణాల్లో, అందులోనూ ప్రభుత్వ భవనాల్లో ఇలా భారీ డోమ్స్ రూపొందించడం ఇదే తొలిసారి. ఒక్కో డోమ్ 82 అడుగులు ఎత్తు (దాదాపు ఎనిమిది అంతస్తులు), 52 అడుగుల వ్యాసం కలిగి ఉంది. ఇవి సచివాలయ భవనానికి ప్రధాన ఆకర్షణగా, సచివాలయ భవనం డిజైన్ ప్రకారం తూర్పు, పశ్చిమ భాగాల్లో భవనంపై ఉన్నాయి. డోమ్‌ల లోపలి భాగాన్ని స్కైలాంజ్ తరహాలో రూపొందించారు. ఇందులోని విశాలమైన కిటికీల నుండి చుట్టూ నగరాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ డోమ్‌ల ప్రాంతం వీఐపీ జోన్‌గా ఉంటూ, సీఎం ముఖ్యమైన సమావేశాలు నిర్వహించేలా రూపొందించబడింది. పైభాగంలో ఉండే రెండు ప్రధాన గుమ్మటాలు సహా మొత్తం 34 డోమ్స్ నిర్మించారు.
జాతీయ చిహ్నాలు
ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటుచేశారు. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే జాతీయ చిహ్నాలను ఢిల్లీలో తయారు చేయించి తీసుకువచ్చి అమర్చారు.
సచివాలయ భూగర్భంలో రిజర్వాయర్
నీటిని పొదుపు చేసే ఉద్దేశంతో సచివాలయ భవనం భూగర్భంలో రెండున్నర లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని రిజర్వాయర్ లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 9 ఎకరాల పచ్చిక బయళ్ల నిర్వహణకు ఈ రిజర్వాయర్ లోని నీటినే వినియోగిస్తారు.
ప్రత్యేకాకర్షణగా ఫౌంటెయిన్లు
పార్లమెంటులో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో (28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వైశాల్యం) సచివాలయంలో ముందు భాగంలో రెడ్‌శాండ్ స్టోన్‌తో రెండు ఫౌంటెయిన్లు ఏర్పాటుచేశారు.
ప్రార్థనా మందిరాలు
సచివాలయంలో మునుపటి మాదిరిగానే హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాలను ప్రభుత్వం నిర్మించింది. గతం కంటే విశాలంగా, సుందరంగా వీటిని తీర్చిదిద్దారు. ఆయా మత పెద్దల ఆకాంక్షల మేరకు నిర్మాణాలు చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దేవాలయం, మసీదు, చర్చి కోసం సుమారు తొమ్మిది వేల చదరపు అడుగులను కేటాయించారు.