Hyderabad: హైదరాబాద్‌లో ప్రముఖ జువెలరీ సంస్థ ఓనర్ అరెస్టు, వెలుగులోకి భారీ మోసం!
ఎంబీఎస్ జువెలరీస్ కి చెందిన డైరెక్టర్ సుఖేష్ గుప్తాను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మెటల్స్ అండ్ మినరల్స్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థను ఈయన మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ జువెలరీ సంస్థ ఓనర్ అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్ లోని ఎంబీఎస్ జువెలరీస్ కి చెందిన డైరెక్టర్ సుఖేష్ గుప్తాను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మెటల్స్ అండ్ మినరల్స్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) అనే ప్రభుత్వ సంస్థను ఈయన మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారానికి డబ్బులు చెల్లించకపోవడంతో సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు రెండు రోజుల పాటు షోరూం సహా ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సంస్థ డైరెక్టర్ సుఖేష్ గుప్తాను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణ కోసం సుఖేష్ గుప్తాను కస్టడీలోకి తీసుకొనే యోచనలో పోలీసులు ఉన్నారు. అందుకోసం కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
ఎంఎంటీసీ నుంచి బయ్యర్స్ క్రెడిట్ స్కీమ్ కింద బంగారం కొనే ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు సుఖేష్ పై ఉన్నాయి. అందులో భాగంగా సుఖేష్ గుప్తాతో పాటు అతడి సంస్థలపై 2013లోనే సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ప్రకారం సోదాలు చేసి గత రాత్రి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఎంఎంటీసీలోని కొందరు అధికారులతో కుమ్మక్కై వారి సహకారంతో ముందుగా చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ ఉంచకుండా, ఫారెక్స్ కవర్ లేకుండానే భారీ ఎత్తున బంగారాన్ని తెచ్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ.
ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారానికి మొత్తం చెల్లింపులు చేయకపోయినా అక్కడి అధికారుల సహకారంతో ప్రధాన కార్యాలయానికి తప్పుడు వివరాలు ఇచ్చారని విచారణలో బయట పడింది. మొత్తానికి ఎంఎంటీసీకి వడ్డీతో కలిపి రూ.504.34 కోట్ల మేర బకాయి పడినట్లు తెలిసింది. ఈ తప్పు బయటికి వచ్చేసరికే ఎంఎంటీసీకి పెద్ద ఎత్తున నష్టం వచ్చిందని సమాచారం.
అంతేకాకుండా బయ్యర్స్ క్రెడిట్ స్కీమ్ ద్వారా సేకరించిన బంగారాన్ని అక్రమంగా అమ్మి ద్వారా భారీ ఎత్తున లాభాలు దండుకొని వ్యక్తిగత ఆస్తులను సమకూర్చుకున్నట్లుగా సీబీఐ అధికారులు 2014లోనే ఛార్జిషీటులో పేర్కొన్నారు.
ఆస్తులు సీజ్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఈడీ ఎంబీఎస్ జ్యుయెలర్స్, ఎంబీఎస్ ఇంప్లెక్స్ సంస్థల యజమానులు అయిన సుఖేష్ గుప్తా, అనురాగుప్తా, నీతూగుప్తా, వందన గుప్తాకు చెందిన రూ.363.51 కోట్ల విలువైన 45 స్థిరాస్తుల్ని గతేడాది ఆగస్టులోనే సీజ్ చేసింది. ఆర్థిక నిందితులు విచారణకు సహకరించకపోవడమే కాకుండా ఆధారాలు సమర్పించడంలోనూ విఫలం చెందారు. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం- ఫెమా కింద నమోదు చేసిన మరో కేసులోనూ ఎంబీఎస్ సంస్థలపై గతంలో ఈడీ రూ.222 కోట్ల ఫైన్ వేసింది. దీంతో ఎంఎంటీసీని మోసగించిన సొమ్మును తిరిగి కట్టేందుకు నిర్వహకులు 2019 లో వన్‌టైమ్ సెటిల్మెంట్ ఒప్పందం చేసుకున్నారు. అయితే నిధులు జమ చేయకపోవడంలో విఫలం అయినట్లుగా ఎంఎంటీసీ గతేడాది స్పష్టం చేసింది.
దీంతో ఎంబీఎస్ వ్యవహారంపై మరోసారి దృష్టిసారించిన ఈడీ గతేడాది ఆస్తులను జప్తు చేయడం సహా రెండు రోజులు విస్తృతంగా తనిఖీలు చేసింది. ఆ సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన బంగారంతో పాటు, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలు, కీలకమైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.