MLA Mahipal Reddy: రూ.300 కోట్ల స్కామ్ లో ఇరుక్కున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఈడీ సంచలన ప్రకటన
BRS MLA మహిపాల్ రెడ్డి అతడి సోదరుడి ఇళ్లు, ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు జరిపారు. పటాన్ చెరు ఎమ్మెల్యే దాదాపు రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
Patancheru MLA Mahipal Reddy and brother in ED Case | హైదరాబాద్: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇళ్లు, ఆస్తులపై సోదాలు చేసిన ఈడీ సంచలన ప్రకటన చేసింది. మైనింగ్ పేరుతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మహిపాల్ రెడ్డి రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు శుక్రవారం నిర్ధారణకు వచ్చారు. మైనింగ్ వ్యవహారంలో వీరి ద్వారా రూ.39 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం చేకూరినట్లు అధికారులు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడి ఇల్లు, ఆఫీసులపై ఈడీ గత రెండు రోజులుగా సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్, హవాలా అనుమానాలతో ఈడీ ఆకస్మిక సోదాలు చేసింది. రియల్ ఎస్టేట్ లో ఈ డబ్బు పెట్టారని గుర్తించిన ఈడీ సోదాలు పూర్తయ్యాక దీనిపై ఓ ప్రకటన చేసింది.
ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూర్చారని ఈడీ ప్రకటన
మహిపాల్ రెడ్డి మైనింగ్ పేరుతో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని, దాని విలువ దాదాపు రూ. 300 కోట్ల మేర ఉంటుందని ఈడీ భావిస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరులు చేసిన చర్యల కారణంగా ప్రభుత్వానికి రూ. 39 కోట్లు నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది. అక్రమంగా సంపాదించిన డబ్బును ఆపై రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేశారని.. కొంత డబ్బు బ్యాంక్ అకౌంట్లలో ట్రాన్స్ క్షన్ చేసినట్లు గుర్తించామని ఓ ప్రకటనలో ఈడీ అధికారులు ప్రకటించారు. తాము చేపట్టిన సోదాలతో రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బినామీల పేర్ల మీద ట్రాన్సాక్షన్స్ జరిపారని, కొన్ని బ్యాంక్ లాకర్స్‌ని తెరిచి పూర్తి స్థాయిలో లెక్క కట్టాల్సి ఉందన్నారు.
మహిపాల్ రెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లి వారిని పరామర్శించారు. ఈడీ తనిఖీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో హరీష్ రావు వెంటన బీఆర్ఎస్ నేతలు సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు.
అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ దాడులతో వేదిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని, కానీ తమ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
‘బిహార్, గుజరాత్ లలో నీట్ ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారు. అక్కడ ఈడీ అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదు
రాష్ట్రంలో లక్షల విద్యార్థులు నీట్ పరీక్ష వ్రాశారు, వారిభవిష్యత్తు అయోమంలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురి చేస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరింపు ధోరణినికి పాల్పడుతున్నారు. మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు.. ఈడీకి ఏలాంటి అక్రమ ఆస్తులు దొరకలేదు. కానీ ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా కర్కశంగా ఈడీ దాడులు చేయటం దారుణం. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు’ హరీష్ రావు.