KTR News: జరగని అవినీతిపై కోట్లు ఖర్చు ఎందుకు?- 7 గంటల ఈడీ విచారణపై కేటీఆర్ కామెంట్స్
Telangana News: కోట్లు వృథా చేయడం తప్ప ఫార్ములా ఈ కారు కేసులో ఎలాంటి అక్రమాలు తేల్చలేరని అన్నారు కేటీఆర్. అసలు అవినీతి అంటూ చేసి ఉంటే కదా అని ప్రశ్నించారు.

Telangana News: రూపాయి అవినీతి లేని కేసుల్లో కోట్లు ఖర్చు పెట్టి విచారణ చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దాదాపు ఏడు గంటల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అవినీతి జరగని ఈ కేసు విచారణకు చేస్తున్న ఖర్చుతో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని సలహా ఇచ్చారు.
"భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను. రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద ఓ అక్రమ కేసు పెడితే విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి మొన్న తొమ్మిదో తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను. " అని చెప్పుకొచ్చారు.
" రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను ఏడు గంటల పాటు అడిగి వివరాలు తీసుకున్నాయి. ఈ రెండు సంస్థలకు ఒక్కటే మాట చెప్పినా. మీరు ఎన్ని సార్లు పిలిచినా వచ్చి సమాధానం చెబుతాను. పూర్తిగా విచారణకు సహకరిస్తానన్నాను. "
రేవంత్ రెడ్డికి సవాల్
ఈ కేసులో ఎన్నిసార్లు ఎక్కడికి విచారణకు పిలిచినా వస్తానన్నారు కేటీఆర్. అయితే ఇంత హంగామా ఖర్చు లేకుండా సింపుల్‌గా ఏ జడ్జి ముందైనా తాను రేవంత్ రెడ్డి కూర్చొని లైవ్‌లో చర్చకు సిద్ధమని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఈ సవాల్‌కు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ఇంత మంది అధికారుల సమయం, ప్రభుత్వ డబ్బు వృథా లేకుండా సింపుల్‌గా కేసు విచారణ తేలిపోతుందని అన్నారు.
" ఈ విచారణకు 10 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. అసలు అవినీతే జరగని ఈ కేసులో అన్ని పైసలను వృథా చేయడం ఎందుకు? ఆ పైసలతోని రైతు రుణమాఫీ చేయొచ్చు? ఇంకా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయవచ్చు."
" అందుకే సంక్రాంతి పండగ సందర్భంగా రేవంత్ రెడ్డికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. హైకోర్టు న్యాయమూర్తికాని, ఇంకా ఏవరైనా న్యాయమూర్తి ముందు మీడియా సాక్షిగా లైవ్ డిబెట్ కు పోదాం. రేవంత్ రెడ్డి ప్యాలెస్‌లో అయినా ఈడీ ఆఫీస్‌లో అయినా, న్యాయమూర్తి ముందు అయినా లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ. దొంగెవరో? దొరెవరో? ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే నాతోపాటు లై డిటెక్టర్ పరీక్షకు రావాలి. ఫార్ములా ఈ కార్ రేసు, ఓటుకు నోటు కేసులకు సంబంధించి రేవంత్‌ను, నన్ను ప్రశ్నలు అడగండి. నేను సమాధానం చెప్తాను. ఆయన కూడా జవాబు చెప్పాలి. తేదీ, సమయం రేవంత్ రెడ్డే నిర్ణయించాలి. ఇలా అయితే ఓ యాభై లక్షల్లో మొత్తం నిజం తెలుస్తుంది. "
అడిగిందే అడిగారు: కేటీఆర్
ఆరేడు గంటల పాటు అడిగిందే అడిగారని ఈడీ విచారణ గురించి చెప్పారు కేటీఆర్. తాను నిజాయతీ గల బిడ్డనని అందుకే దర్యాప్తు సంస్థలు ఎన్నిసార్లు విచారించినా వస్తానని అన్నారు. అందరి ముందు డబ్బులతో దొరికిపోయిన వారికి లేని భయం అవినీతి చేయని తనకు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనం వృథా అవ్వడం తప్ప ఇందులో ఎలాంటి అవినీతి తేల్చ లేరని అన్నారు కేటీఆర్.
" ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా ఏసీబీ కి రేవంత్ రెడ్డి దొరికిండు కాబట్టే నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టిచ్చిండు. రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది కాబట్టే నా మీద ఈ ఈడీ విచారణ జరిపిస్తున్నారు. అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం నిజాయితీనే గెలుస్తుంది. హైకోర్టు. సుప్రీంకోర్టు. భారత న్యాయవ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉంది. ఇవాళ కాకుండా ఇంకో నాలుగు రోజులకైనా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాసం నాకుంది. "
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌ను ఉదయం పదిన్నర నుంచి ఈడీ అధికారులు విచారించారు. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ విచారణ చేపట్టంది. ఈ కేసులో జరిగిన లావాదేవీలు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా జరగలేదని అందుకే విచారణకు రావాలని చాలా రోజు క్రితం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీఅధికారులు మాజీ మంత్రిని విచారించారు. ఇప్పుడు ఈడీ విచారించింది.
విచారణ మధ్యలో 1.30 నుంచి గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తనకు ఏం తెలియదని అంతా అప్పటి అధికారులకే తెలుసని కేటీఆర్ సమాధానం ఇచ్చినప్పుడు ప్రచారం జరుగుతోంది. 45 కోట్ల బదిలీ విషయంలో బ్యాంకు అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని అన్నట్టు తెలుస్తోంది. ఇందులో రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని పదే పదే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.
" ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు నేను తప్పు చేయలేదు తప్పు చేయబోను. ఇందులో అర పైసా అవినీతి కూడా జరగలేదు. 8 గంటలు వాళ్ళ ఇదే అడిగారు నేను ఇదే చెప్పారు తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీ. పారదర్శకంగా నిధుల బదిలీ జరిగింది ఇంకెక్కడ మనీ లాండరింగ్ అని ఏసీబీ, ఈడీ అధికారులను అడిగాను. ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు అడిగింది. అన్నింటికి సమాధానాలు ఇచ్చాను."
కేటీఆర్ ఈడీ విచారణకు వచ్చిన వేళ బషీర్‌భాగ్‌లోని ఈడీ కార్యాలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కేటీఆర్‌తోపాటు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు హడావుడి చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: ఫామ్ హౌస్‌లో చెట్టు నాటిన హిమాన్షు - పక్కనే ఉండి సూచనలు చేసిన కేసీఆర్- వీడియో వైరల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

