Hyderabad: 30 టీమ్‌లతో ఈడీ అధికారులు రంగంలోకి, మంత్రి గంగుల ఇంట్లోనూ సోదాలు!
హైదరాబాద్ సోమాజీగూడ, అత్తాపూర్‌లో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో, కరీంనగర్‌లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు.
గ్రానైట్ వ్యాపారుల్లో తెలంగాణకు చెందిన వారి ఇళ్లు, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. తాజాగా హైదరాబాద్ సహా కరీంనగర్‌లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం (నవంబరు 9) ఉదయం నుంచే కేంద్ర బలగాలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసుకు చేరుకున్నాయి. కరీంనగర్, హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహించేందుకు తెల్లవారుజామునే అధికారులు వెళ్లారు.
హైదరాబాద్ సోమాజీగూడ, అత్తాపూర్‌లో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో, కరీంనగర్‌లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈడీ, ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో గ్రానైట్ రవాణా పన్ను ఎగవేసిన వ్యవహారంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి.
కరీంనగర్ మంకమ్మ తోటలోని శ్వేతా గ్రానైట్స్ కార్యాలయం, కమాన్ ఏరియాలోని అరవింద వ్యాస్ గ్రానైట్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఈ శ్వేతా గ్రానైట్ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందినది. మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చినందున వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, గతంలో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తక్కువ పరిమాణం చూపి విదేశాలకు ఎక్కువ ఎగుమతులు చేయడంపై ఈడీ ఆరా తీస్తోంది.
తనిఖీల్లో పాల్గొన్న 30 టీమ్ లు
బుధవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో దాదాపు 30 బృందాలు, 10 వాహనాల్లో సోదాలు నిర్వహించేందుకు ఈడీ కార్యాలయం నుంచి అధికారులు బయలుదేరాయి. వాటిలో కొన్ని బృందాలు కరీంనగర్‌వైపు వెళ్లగా.. మరికొన్ని బృందాలు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు.. కేంద్ర బలగాల్లో మహిళా అధికారులు కూడా ఉన్నారు. కాగా, కొద్దిరోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈడీ అధికారులతోపాటు ఐటీ అధికారులు కూడా సోదాలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ ఈడీ అధికారుల్లో కొంత మంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
అప్రూవర్ గా మారిన ఢిల్లీ డిప్యూటీ సీఎం అనుచరుడు
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. అతను చెప్పిన సమాచారంతోనే హైదరాబాద్, కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈడీ ప్రశ్నించిన వారి ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. లిక్కర్ స్కాం వెనుక ఎవరెవరు ఉన్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ మద్యం విధానంలో భాగంగా ఢిల్లీ నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కి ఫిర్యాదు చేశాయి. మద్యం విక్రయదారుల నుంచి దాదాపు రూ.144 కోట్ల బకాయిలను మాఫీ చేయాలన్న ఎక్సైజ్ శాఖ నిర్ణయాన్ని కూడా గవర్నర్ వీకే సక్సేనా తప్పుబట్టారు.