BR Ambedkar: హైదరాబాద్ విషయంలో అంబేద్కర్ అనుకున్నది జరగలేదా?
హైదరాబాద్ మనదేశానికి రెండో రాజధానిగా ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని ఆయన మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు.
హైదరాబాద్ మనదేశానికి రెండో రాజధానిగా ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని ఆయన మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. హుస్సేన్ సాగర్ తీరంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. రెండో రాజధానిగా హైదరాబాద్ సరైందని, పాక్, చైనా నుంచి హైదరాబాద్ ఎంతో దూరంలో ఉంది కాబ్టటి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న బాబాసాహెబ్ ఆశయం నెరవేరలేదని ప్రకాశ్ అంబేద్కర్ చెప్పుకొచ్చారు. రూపాయి సమస్యపై 1923లోనే అంబేద్కర్ పరిశోధనా పత్రం రాశారని.. ఆంగ్లేయులు ఇండియాని ఎలా దోచుకుంటున్నారో గ్రహించారని చెప్పారు. ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రకాశ్ అంబేద్కర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
కొన్ని అతిచిన్న కులాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసేవరకు సమస్య పరిష్కరించలేదు. తెలంగాణ కోసం కూడా ఎంతో పోరాటం జరిగింది. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేద్కర్ మద్దతిచ్చారు. రూపాయి బలోపేతం ఆవశ్యకతను అంబేడ్కర్ నొక్కి చెప్పారు. ఆంగ్లేయులు భారత్ను ఎలా దోచుకున్నారో అంబేద్కర్ గ్రహించారు. ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు. దళితబంధు పథకం సమాజంలో కొత్త దిశను చూపించింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్యం ఇంకా దూరంగానే ఉంది. ఆదివాసీలు, దళితులు వృద్ధిలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే ఆర్థిక అసమానతలను తొలగించవచ్చు. బలిదానాలు జరగకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పడే పరిస్థితి లేదు. అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. అంటరానితనాన్ని పారదోలేందుకు అంబేద్కర్ కృషి చేశారు. ఇంత పెద్ద భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు కేసీఆర్కు శుభాకాంక్షలు. ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి. సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం అవసరం. సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదు.- ప్రకాశ్ అంబేద్కర్
అంతకుముందు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ కలిశారు. ఆయనను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. అనంతరం విగ్రహావిష్కరణ కోసం ప్రగతి భవన్ నుంచి కాన్వాయ్లో బయలుదేరారు.
ఉదయం హుజురాబాద్, జమ్మికుంటలో పర్యటన
ఉదయం హుజురాబాద్, జమ్మికుంటలో దళితబంధు యూనిట్లను ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ పరిశీలించారు. ఈ పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగమని అభిప్రాయపడ్డారు. అంతకుముందు లబ్దిదారులంతా మరొకరి వద్ద ఉద్యోగాలు చేసేవారని.. ఇప్పుడా పరిస్థితి పోయిందని సంతోషం వ్యక్తం చేశారు. పథకాలు పడ్బందీగా అమలు చేస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు ఉపాధి కల్పించే పథకాలు అమలు చేస్తేనే దళితుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు. గత 70 ఏళ్లుగా జీవన ప్రమాణాలు మెరుగు పడక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తీరును స్వయంగా చూశానని చెప్పుకొచ్చారు. ఇలాంటి పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు.