Heavy Rains IMD: బంగాళాఖాతంలో అల్ప పీడనం- తుపానుగా మారే సూచన- తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు!
Weather Update : వేసవి కాలం అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలోనే మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
Weather Update : గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇటీవల కురిసన భారీ వర్షాలతో రాష్ట్రంలో వేల ఎకరాల పంట వర్షార్పణం అయింది. లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ వానలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఈనెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం చోటు చేసుకుందని.. ఇది 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరిస్తోంది. బంగాళాఖాతం వైపు కదులుతూ ఇది తుపాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అక్కడక్కడ మాత్రమే వానలు
మరోవైపు తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. దీని వలన విశాఖపట్నంతోపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉండనుంది. ఎం.జే.వో. ఇప్పుడు బంగాళాఖాతంలో కొనసాగుతోంది. అది భారీ వర్షాలకు, పిడుగులకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఎన్.టీ.ఆర్., పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం (కోస్తా భాగాలు), నెల్లూరు, తిరుపతి, చిత్తూరు , కడప, అన్నమయ్య, నంధ్యాల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూడగలము.
30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్న గాలులు
తెలంగాణలో పరిస్థితి కూడా అలానే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జల్లులు పడవచ్చని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని చెబుతోంది. కొన్ని చోట్ల వడగళ్ల వర్షం కూడా పడుతుందని రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. వర్షాలతోపాటు గాలులు కూడా 30- 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతోంది. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రత- ఆదిలాబాద్ 35.3
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత- హయత్‌నగర్- 19.0
ఇవాళ గరిష్టఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం
ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు రికార్డు అయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
నాలుగు రోజులుగా భారీ వర్షాలు..
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా వర్షాలు కురిశాయి. జిల్లాలోని కాకుమాను మండలంలో 75, ప్రత్తిపాడులో 50.4, దుగ్గిరాలలో 41.2, వట్టిచెరుకూరులో 24.6, తెనాలిలో 23.8, మంగళగిరిలో 15, పెదకాకానిలో 13, చేబ్రోలులో 12.2మి.మీ చొప్పున వర్షపాతం నమోదు అయింది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వానలు ఇంకా వీడలేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 60 మి.మీ వర్షపాతం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 46.6. ఇరగవరంలో 32.2. ఆచంటలో 20, పోడూరులో 19, పెంటపాడులో 17, తణుకులో 15 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ పలు చోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అనంతపురం జిల్లాలోని 10 మండలాల పరిధిలో 4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. శ్రీసత్య సాయి జిల్లాలోని 5 మండలాల పరిధిలో వర్షం కురిసింది.