Bathukamma Sarees: ప్రతి ఊర్లో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి, కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
Bathukamma Sarees: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం శాంతి కుమారి ఆదేశించారు.
Bathukamma Sarees: బతుకమ్మ పండగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే 85 లక్షల చీరలను వివిధ జిల్లాలకు సరఫరా చేసినట్లు సీఎస్ వెల్లడించారు. ఈ నెల 14వ తేదీకి బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బతుకమ్మ చీరలను అర్హురాలైన ప్రతి మహిళకు అందేటట్లు చూడాలని సూచించారు.
ఇప్పటికే 80 శాతం చీరలు పంపిణీ కేంద్రాలకు చేరుకున్నాయి. ఈ ఏడాది చేనేత సంఘాల ఆధ్వర్యంలో రూ.354 కోట్లతో 1.02 కోట్ల చీరలను సిద్ధం చేశారు. జరీ వివిధ కలర్ కాంబినేషన్ తో 250 డిజైన్లతో ఆకర్షణీయమైన చీరలు తయారు చేశారు. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండగ నిలిచింది. మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగకు బాలబాలికలు అందరూ కొత్త చీరలు కట్టుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల నేత కార్మికులు ఈ బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారు. బతుకమ్మ పండగ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ఈ నెల 4వ తేదీ నుంచి చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ చేనేత జౌళి శాఖ సన్నాహాలు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తుండగా.. ఈ సారి 1.02 కోట్ల చీరలను సిద్ధం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రంగులు, 25 డిజైన్లు, 240 వెరైటీలతో బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి.
టెక్స్‌టైల్ శాఖ గతంలో కంటే ఎక్కువ డిజైన్లు, రంగులు, వెరైటీల్లో చీరలను తయారు చేసింది. జరీతో పాటు వివిధ రంగుల కాంబినేషన్ లో ఈ చీరలు ఉంటాయి. టెక్స్‌టైల్ శాఖ 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు చీరలను వివిధ ఆకర్షణీయమైన రంగులు, థ్రె్డ్ బార్డర్ తతో తయారు చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఈ బతుకమ్మ చీరలు 6 మీటర్లు, 9 మీటర్లలో ఉంటాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించాలని కూడా సీఎస్ ఆదేశించారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తారని తెలిపారు. ఆ రోజు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతో ఎంపిక చేసి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించాలని చెప్పారు. నగర ప్రాంతాల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. గ్రామీణ క్రీడా కేంద్రాల అభివృద్ధిలో భాగంగా 18 వేల క్రీడా పరికరాల కిట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.