Hyderabad ఓఆర్ఆర్ టోల్ గేట్ లీజులో భారీ అవినీతి, ఒప్పందం రద్దు చేయకపోతే కోర్టుకు వెళ్తాం: బీజేపీ ఎమ్మెల్యే
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమక్షంలో టోల్ గేట్ లీజు విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) టోల్ గేట్ లీజు పంచాయితీ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. తాజాగా బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమక్షంలో టోల్ గేట్ లీజు విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్స్ ద్వారా రోజుకు సుమారుగా రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంటే, తమ స్వలాభం కోసం హెచ్ ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్, కాంట్రాక్టు సంస్థతో చేతులు కలిపి, అత్యంత తక్కువ ధరకే ముఫై ఏళ్లపాటు టోల్ గేట్ సొమ్ము దండుకోమంటూ అప్పగించారని రఘునందన్ రావు ఆరోపించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ నిర్వహణను రాబోయే మప్ఫై ఏళ్లపాటు ప్రవేటు సంస్దకు నిర్వహణ బాధ్యతను అప్పగించేందుకు సిద్దమైన HMDA గత ఏడాది నవంబర్ 10వ తేదీన టెండర్లు పిలిచింది. 2023 మార్చి 31వ తేది వరకూ గడువునిచ్చింది. ఈ టెండర్లలో క్వాలిఫై అయిన నాలుగు కంపెనీలు ఐఆర్ బి ఇన్ప్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ 7,272 కోట్ల రూపాయలకు టెండర్ వేయగా, రెండవ స్దానంలో దినేష్ చంద్ర అగర్వాల్ ఇన్ ఫ్రా కంపెనీ 7,007 కోట్ల రూపాలయలకు టెండర్ వేసి రెండో స్దానంలో నిలిచింది. గవార్ కనస్ట్రక్షన్ కంపెనీ 6,767కోట్ల రూపాయలతో మూడో స్థానం, ఈగల్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ 5,634 కోట్ల రూపాయలతో నాల్గవ స్థానంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ల నిర్వహణ టెండర్లలో పోటీపడ్డాయి. ఈ ఏడాది మార్చి 31 వ తేదితో టెండర్ల ప్రక్రియ గడువు ముగియడంతో ఏప్రిల్ 11వ తేది టెండర్లను ఓపెన్ చేశారు. టోల్ గేట్ నిర్వహణకు పోటీపడిన నాలుగు కంపెనీలలో ఎక్కవ ఆఫర్ చేసిన ఐఆర్ బి కంపెనీ ముఫై ఏళ్ల పాటు టెండర్లు దక్కించుకున్నట్లుగా HMDA ప్రకటించింది.
ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ, ఐఆర్ బి కోడ్ చేసి సొమ్ము 7272 కోట్లు కాగా, HMDA కమీషన్ అరవింద్ కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాత్రం ఐఆర్ బి 7380 కోట్ల రూపాయలు కోడ్ చేసినట్లుగా ప్రకటించారు. ఇక్కడే తప్పులోకాలేసారంటూ విమర్మలు వెల్లువెత్తుతున్నాయి. బిజెపి ఎమ్మెల్యే రఘనందన్ రావు సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్నారు. టెండర్ల ప్రక్రియలోనే బహిరంగంగా కంపెనీ 7272 కోట్లు కోడ్ చేస్తే ,ఆ తరువాత HMDA విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాత్రం 7380 కోట్లుగా ఎందుకు చూపించిందని ప్రశ్నిస్తున్నారు. అదనంగా 108 కోట్ల రూపాయలు ఎవరు చెబితే కంపెనీ పెంచిందని, దాని వెనుక అధికార బిఆర్ ఎస్ మంత్రులు, HMDA కమిషనర్ పాత్ర ఎంతుందో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు రఘునందన్ రావు.
ఈ ఏప్రిల్ నెల సగటు టోల్ గేట్స్ నుండి వచ్చిన ఆదాయం రోజుకు కోటి ఎనభై ఐదు లక్షలు దాటింది. ఏడాదికి సుమారుగా 720 కోట్లు ఆదాయం వస్తోంది. ముఫై ఏళ్లపాటు లీజుకు ఇవ్వడమంటే సుమారుగా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మరి అంతలా ఆదాయం వస్తున్న ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్స్ లీజును అప్పనంగా ఓ కంపెనీకి కేవలం 7380 కోట్లకు 30 ఏళ్లపాటు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు రఘనందర్ రావు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టోల్ గేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రభుత్వమే టోల్ గేట్ లను నిర్వహిస్తూ బ్యాంక్ నుండి నిధులు తెచ్చి బ్యాంక్ వడ్డీ చెల్లించినా మంచి లాభాలు వస్తాయని, అలాండిది ప్రజల సొమ్మును వేల కోట్ల రూపాయలు ఐఆర్ బి అనే సంస్థకు అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అందులోనూ డిఫాల్టర్ గా ఉన్న ఐఆర్ బి కంపెనీకి తిరిగి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు రఘునందన్ రావు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ నిర్వహణ ఒప్పందం ప్రక్రియ వెంటనే ఆపకపోతే కోర్టుకు వెళ్లి స్టే తెస్తామని హెచ్చరించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు. ఈ విషయంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, HMDA కమిషనర్ తన కాల్ డేటా వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ వ్యహారంపై సిబిఐ, ఈడిల కు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ టోల్ గేట్ కుంభకోణంపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు రఘనందన్.