Cool Roof Policy: ఇల్లు చల్లగా ఉండేలా కూల్ రూఫ్, ప్రభుత్వ, వాణిజ్య నిర్మాణాలకు తప్పనిసరి
Cool Roof Policy: ఇంట్లో చల్లగా ఉండేలా, విద్యుత్ వాడకం తగ్గేలా కూల్ రూఫ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ప్రభుత్వ, వాణిజ్య భవనాలకు ఇది తప్పనిసరి కానుంది.
Cool Roof Policy: వేసవి కాలంలో బయట కాలు పెట్టాలంటే జంకాల్సిందే. ఎండ వేడికి ఆగమైపోతుంటాం. ఇంట్లో ఉన్నా పరిస్థితి ఏమంత బాగుండదు. వేడికి, ఉక్కపోతకు సతమతమైపోతాం. దీని వల్ల రోజంతా ఫ్యాన్, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తాం. దీని వల్ల కరెంటు బిల్లులు కూడా మోతమోగిపోతాయి. ఈ ఇబ్బందుల నుండి ఉపశమనం లభించేందుకు చాలా మంది ఇంటి పైకప్పుపై కూల్ పెయింట్లు, వినైల్ షీట్లు, టైల్స్ ను ఆశ్రయిస్తుంటారు చాలా మంది.
Will be launching "Telangana Cool Roof Policy 2023-28" tomorrow
— KTR (@KTRBRS) April 2, 2023
With this, Telangana will be the only state to come out with such a policy aimed at reducing the urban heat island impact & heat stress and in the process save on CO2 emissions & save energy pic.twitter.com/WbvzlYYce2
వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఇళ్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో పడకుండా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందుకోసం రాష్ట్ర పురపాలక శాఖ కూల్ రూఫ్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. తెలంగాణ కూల్ రూఫ్ విధానం 2023-28ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ(సోమవారం) ప్రారంభించనున్నారు. దీని కోసం రెండు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్న పురపాలక శాఖ ఎట్టకేలకు అమలుకు సిద్ధమైంది. హైదరాబాద్ నగరంలో 100 చదరపు కిలోమీటర్ల మేర, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతంలో 300 చ.కి.మీ విస్తీర్ణంలో కూల్ రూఫ్స్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇంటిపై కూల్ రూఫ్ లను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను ప్రోత్సహించడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించడం, నగరాల వారీగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా ఏజెన్సీలతో సమన్వయం, వీటి కోసం పని చేసే సిబ్బందికి శిక్షణ వంటివి ఇవ్వనున్నారు.
దేవరకొండ బస్తీలో ప్రయోగాత్మకంగా కూల్ రూఫ్ విధానం అమలు
ఇంటిపై కూల్ రూఫ్ లతో ఇంట్లో వేడి తగ్గుతుంది. దీని వల్ల ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం తగ్గుతుంది. అలా కరెంటు వాడకం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, ట్రిపుల్ ఐటీ, జీహెచ్ఎంసీలతో కలిసి కూల్ రూఫ్ విధానాన్ని తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీ, ఆస్కి కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని దేవరకొండ బస్తీలో ప్రయోగాత్మకంగా కూల్ రూఫ్ విధానాన్ని అమలు చేసి ఫలితాలను నమోదు చేశాయి. హైదరాబాద్ లోని బస్తీల్లో ఈ విధానాన్ని అమలు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సర్కారు యోచిస్తోంది. అయితే దీని విధి విధానాలు ఏంటి, నిధులు ఎలా అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇంటిపై కూల్ రూఫ్ ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయు. ప్రత్యేక రసాయనాలు, పైకప్పు ఉపయోగించే సామగ్రిలో మార్పులతో దాదాపు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతను తగ్గించవచ్చని అంచనా. కూల్ రూఫ్ ఏర్పాటు చేయడం వల్ల సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకే పరావర్తనం చెంది ఇంట్లోకి వేడి రావడం తగ్గుతుంది. ఇప్పటికే నిర్మాణం అయిన భవనాలపై కూల్ రూఫ్ ఏర్పాటు చేసుకునేందుకు పలు విధానాలు మార్కెట్లో ఉన్నాయి. శ్లాబ్ పైన కూల్ పెయింట్ వేయడం, విలైన్ షీట్లు అమర్చడం, టైల్స్ వేసుకోవడం, సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడం, టెర్రస్ గార్డెనింగ్ ద్వారా ఇంటిని చల్లగా ఉంచవచ్చు.