Continental Biobank: భారత వైద్య చరిత్రలో మైలురాయి; AI సాయంతో ‘కాంటినెంటల్ నెక్స్ట్-జనరేషన్ బయోబ్యాంక్’ ప్రారంభం
Continental Biobank: నెక్స్ట్-జనరేషన్ బయోబ్యాంక్‌ను కాంటినెంటల్ హాస్పిటల్ నవంబర్ 10, 2025న ప్రారంభించింది. ఇది ఇది భారతీయ వైద్య పరిశోధనా రంగంలో విప్లవాత్మకమైన మార్పుగా వైద్యులు చెబుతున్నారు.

Continental Biobank: భారతీయ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో, కాంటినెంటల్ హాస్పిటల్స్ నెక్స్ట్-జనరేషన్ బయోబ్యాంక్‌ను నవంబర్ 10, 2025న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్స్ వేదికగా ప్రారంభించారు. ఇది భారతీయ వైద్య పరిశోధనా రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా వైద్యులు ప్రకటించారు. ఇది కేవలం నమూనాలను నిల్వ చేసే కేంద్రం మాత్రమే కాదని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తెలివైన డేటా వ్యవస్థలను ఆధునిక బయోబ్యాంకింగ్ మౌలిక సదుపాయాలతో సమన్వయం చేసే ఒక సమీకృత వేదికగా అభివర్ణిస్తున్నారు.

వ్యాధుల అధ్యయనాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ఈ బయోబ్యాంక్ ఏర్పాటు తక్షణ లక్ష్యం. ఈ లోతైన అవగాహన ద్వారా, ముందస్తు నిర్ధారణలు మరింత సులభతరంకానున్నాయి. అంతేకాకుండా, ఇది రోగులకు మరింత ప్రభావవంతమైన చికిత్సలను అందించడానికి దోహదపడుతుంది.
అంతర్జాతీయ ప్రమాణాలు
ఈ బయోబ్యాంక్ కేవలం దేశీయ అవసరాల కోసం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలకు అనుకూలంగా రూపొందించారు. ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి . ఈ బయోబ్యాంక్ నమూనాల నిర్వహణ, నిల్వ, అనుమతి వంటి అంశాలలో అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు.
డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఈ బయోబ్యాంక్‌ను ఒక బ్రిడ్జ్‌గా అభివర్ణించారు. ఈ వంతెన భారతదేశం అద్భుతమైన క్లినికల్ ప్రతిభను, అగ్రగామి అమెరికన్, ఇతర అంతర్జాతీయ అకాడమిక్ సంస్థలు, అలాగే అత్యాధునిక AI పరిశోధనా వేదికల ప్రపంచ శాస్త్రీయ ఆవిష్కరణలతో అనుసంధానిస్తుందన్నారు. ఇది జీవశాస్త్ర డేటాను సేకరించే, ఉపయోగించే విధానంలోనే విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. రోగులను పరిశోధనల్లో భాగస్వామ్యం చేయడానికి ప్రోత్సహించడం ద్వారా, ఇతరులకు మెరుగైన వైద్య ఫలితాలను అందించడంలో తోడ్పడేలా ఈ వ్యవస్థను రూపొందించామన్నారు. ఈ చొరవ కాంటినెంటల్ హాస్పిటల్స్‌ను రోగి-కేంద్రిత బయోమెడికల్ ఆవిష్కరణల కొత్త యుగానికి నడిపిస్తుందని డాక్టర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

పరిశోధనపై AI ప్రభావం
ఈ బయోబ్యాంక్ అంతర్గత శక్తి, నమూనాలను సేకరించడంలోనే కాకుండా, వాటిని AI ఆధారిత విశ్లేషణలతో అనుసంధానం చేస్తుందని వైద్యులు వివరించారు. ఈ అధునాతన మౌలిక సదుపాయం ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా, నాలుగు ప్రధాన ఆరోగ్య రంగాలలో ఇది అద్భుతాలు సృష్టించగలదని పేర్కొన్నారు. ఆంకాలజీ (క్యాన్సర్), ఇమ్యునాలజీ, కార్డియోవాస్క్యులర్ వ్యాధులు, న్యూరాలజీ, అరుదైన రుగ్మతలు గుర్తింపులో ఇది మంచి ఫలితాలు ఇస్తుందని తెలిపారు.

ఈ వ్యవస్థ కేవలం ఫార్మాస్యూటికల్ , బయోటెక్ పరిశోధనలకు మాత్రమే కాకుండా, రోగులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పర్శనలైజ్డ్ చికిత్సా వ్యూహాలను రూపొందించడానికి హెల్ప్‌చేస్తుందని డాక్టర్ గురు వెల్లడించారు. కొత్త నిర్ధారణ సాధనాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుందన్నారు. దీని ఫలితంగా రోగులకు ముందస్తు వ్యాధి గుర్తింపు, మరింత సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

క్యాన్సర్ పరిశోధనలో బయోబ్యాంక్ కీలకం: రిషి రెడ్డి
యుఎస్ సహ వ్యవస్థాపకుడు, కాంటినెంటల్ హాస్పిటల్స్ డైరెక్టర్ రిషి రెడ్డి, బయోబ్యాంకుల పాత్రను స్పష్టం చేశారు. క్యాన్సర్ పరిశోధనలో ఈ బయోబ్యాంకులు చాలా కీలకంగా మారుతాయన్నారు. ఇది కేవలం నిల్వ కేంద్రం కాదని ఇది జనోమిక్ (Genomic) ప్రోటియోమిక్ (Proteomic) పరిశోధనలకు కీలకంగా ఉంటుందని తెలిపారు. మెటబొలోమిక్ (Metabolomic) పరిశోధనలు నిర్వహించడానికి కేంద్ర స్థానమని పేర్కొన్నారు. మాలిక్యులర్ ఎపిడెమియాలజీ, ట్రాన్స్ లేషనల్ అధ్యయనాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, థెరపీ అభివృద్ధికి, బయోమార్కర్, డ్రగ్ డిస్కవరీకి కేంద్రం స్థానం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.





















