TS High Court: హైకోర్టును ఆశ్రయించిన సునీల్ కనుగోలు - ఆ నోటీసులపై స్టే కోరుతూ పిటిషన్
ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసును సవాల్ చేస్తూ సునీల్ కొనుగోలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ వార్ రూంగా పిలిచే ఆయన కార్యాలయంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేసి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు తీసుకెళ్లి, ఆఫీసును సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. 41ఏ CRPC నోటీసులు ఇవ్వగా, ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసును సవాల్ చేస్తూ సునీల్ కొనుగోలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 41ఏ CRPC నోటీసుపై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని సునీల్ కనుగోలు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను రేపు కోర్టు విచారణ చేయనుంది.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం మాదాపూర్ ఇనార్బిట్ మాల్ పక్కనే ఉన్న ఓ వాణిజ్య భవంతిలో ఉండగా, ఆయన కార్యాలయంలో సోదాలు జరిగాయి. సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రైడ్స్ జరిగినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సోదాల సందర్భంగా సునీల్ కార్యాలయంలోని సిబ్బంది సెల్ ఫోన్లను పోలీసులు స్విచ్ ఆఫ్ చేయించారు. ఆఫీసులోని కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. సునీల్ కనుగోలు టీమ్ గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తూ ఉంది.
కానీ, పోలీసుల వాదన మరోలా ఉంది. సునీల్ కనుగోలు కార్యాలయం నుంచి ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ తో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని పోలీసులు చెప్పారు. తమ దగ్గర ఐదారు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయని.. వాటి ఆధారంగా సోదాలకు వచ్చామని అన్నారు. సోదాలకు వచ్చేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు చెప్పారు.